అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం ప్రస్తుతం ఇస్రో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు ఇస్రో చీఫ్ వి. నారాయణన్ వెల్లడించారు. వాటిలో 80వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్లను తయారుచేయడం, 2026లో వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపడం, 2035 నాటికి జాతీయ అంతరిక్ష కేంద్రం, చంద్రుడిపై అధ్యయనం కోసం వీనస్ ఆర్బిటర్ మిషన్ (VOM) ఏర్పాటు వంటి లక్ష్యాలను ఏర్పరుచుకున్నామన్నారు. అంతరిక్ష మిషన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ బిగ్ డేటా వంటివాటిని ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
వికసిత భారత్‌కు దూతగా 2040లో భారతీయ వ్యోమగామి చందమామపై అడుగుపెట్టనున్నాడని నారాయణన్ పేర్కొన్నారు. 2027లో చేపట్టబోయే మానవ సహిత గగనయాత్ర మిషన్ ట్రాక్‌లో ఉందని వెల్లడించారు. 2040 నాటికి తొలి మానవసహిత జాబిల్లి యాత్ర చేపట్టాలని ప్రధాని దిశానిర్దేశం చేశారని..అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు అంతరిక్ష కార్యక్రమంలో ఈ యాత్ర కీలకపాత్ర పోషిస్తుందన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇస్రో ప్రణాళికలను పంచుకున్న వి. నారాయణన్ గగన్‌యాన్‌లో భాగంగా తాము మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకొచ్చేందుకు 2027లో ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-4 ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. కొన్నేళ్ల క్రితం అంతరిక్షరంగంలో రెండు లేక మూడు స్టార్టప్‌లు మాత్రమే ఉండేవని.. ప్రస్తుతం ఉపగ్రహ తయారీ, ప్రయోగ సేవలు, అంతరిక్ష ఆధారిత డేటా విశ్లేషణలపై అధ్యయం కోసం 300 కంటే ఎక్కువ స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని ఇస్రో చీఫ్ అన్నారు. వ్యవసాయం, విపత్తు ప్రతిస్పందన, నిర్వహణ, టెలికమ్యూనికేషన్, రియల్-టైమ్ రైలు, వాహన పర్యవేక్షణలో ఉపగ్రహ ఆధారిత అనువర్తనాల అధ్యయనానికి ఇవి ఉపయోగపడతాయన్నారు.
The post ISRO Chief Narayanan: అంతరిక్షానికి 80వేల కేజీలను మోసుకెళ్లేలా రాకెట్లు – ఇస్రో చీఫ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
