బీహార్‌లో నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సీట్ల కేటాయింపు విషయంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌ఎడీఏ)లో తర్జన భర్జనలు జరుగుతుండగా, ఇదే సమయంలో సీఎం నితీష్ కుమార్‌కు చెందిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)బుధవారం 57 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. సానాబార్సా నుంచి రత్నేష్ సదా, మోర్వా నుంచి విద్యాసాగర్ నిషద్, ఎక్మా నుంచి ధుమాల్ సింగ్, రాజ్‌గిర్ నుంచి కౌశల్ కిషోర్ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలకు కూడా టికెట్ లభించింది.
కేబినెట్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి (సరై రంజన్), నరేంద్ర నారాయణ్ (ఆలంనగర్), నిరంజన్ కుమార్ మెహజా (బిహారిగంజ్), రమేష్ రిషి దేవ్ (సింఘేశ్వర్), కవితా సాహ (మధేపుర), గందేశ్వర్ షా (మహిషి), అతిరేక్ కుమార్ (కుషేశ్వర్‌స్థాన్) పోటీలో ఉన్నారు. ఇతర ప్రముఖుల్లో అనంత్ కుమార్ సింగ్ (మోకామ), శ్యామ్ రజక్ (ఫుల్వారి), మదన్ సాహ్ని (బహదూర్‌పూర్), శ్రీ భగవాన్ సింగ్ కుష్వాహ (జగదీష్‌పూర్), కోమల్ సింగ్ (గైఘాట్) ఉన్నారు.
ఈసారి టికెట్ల కేటాయింపుల్లో పలు నియోజకవర్గాల్లో మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. అమన్ భూషణ్ హజారి టికెట్ క్యాన్సిల్ చేసి కుష్వేశ్వర్‌స్థాన్ నుంచి అతిరేక్ కుమార్‌కు సీటు ఇచ్చారు. బార్ బిఘ నుంచి సుదర్శన్ టికెట్‌ను ఉపసంహరించుకున్నారు. ఆ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనేది అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. టికెట్ల కేటాయింపుల్లో పార్టీ నేతల్లో అసంతృప్తులు సైతం వ్యక్తమవుతున్నాయి. ఎన్డీయే కూటమిలో పెరుగుతున్న ఉద్రిక్తతలను ఈ పరిణామాలు సూచిస్తున్నాయని చెబుతున్నారు. ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేస్తుండగా, లోక్ జన్‌శక్తి (రామ్ విలాస్) 29 చోట్ల, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం చెరో 6 చోట్ల పోటీ చేస్తున్నాయి. నవంబర్ 6,11 తేదీల్లో పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
The post CM Nitish Kumar: 57 మందితో జేడీయూ తొలి జాబితా విడుదల appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
