కోస్తా జిల్లాల వైపు ‘మొంథా’ తుపాను దూసుకొస్తోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముందని ఐఎండీ ఓ ప్రకటలో తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారి.. రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది. మంగళవారం 12 గంటల పాటు తీవ్ర తుపాను తీవ్రత కొనసాగి.. ఆపై తుపానుగా బలహీనపడొచ్చని చెప్పింది. తుపాను ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
మొంథా తుపాన్ ప్రభావం కాకినాడలో మొదలైంది. సముద్రం దగ్గర వాతావరణం ఒక్కసారిగా మారింది. ఇపుడు భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. దాంతో తీర ప్రాంత మండలాల్లో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, తాళ్లదేవు, ఉప్పాడ కొత్తపల్లి, తుని, తొండంగి మండలాలపై తుఫాన్ ప్రభావం భారీగా ఉండనుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కాకినాడ చేరుకున్నాయి. రేపు సాయంత్రానికి కాకినాడ తుని మధ్య తుపాన్ తీరం దాటనుంది. ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తుపాన్ ప్రభావంతో కాకినాడ యాంకరేజ్ పోర్ట్, డీప్ సీ పోర్ట్ ఖాళీ అయ్యాయి. కార్గో ఉన్న 15 షిప్లను సముద్రంలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బీచ్, పర్యాటక ప్రాంతాలు ఇప్పటికే మూసివేశారు. ఐదు రోజుల పాటు జిల్లాలో విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. సహాయక చర్యల కోసం వంద మంది గజ ఈత గాళ్ళు, 70 బోట్లు సిద్ధంగా ఉన్నాయి. అందుబాటులో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్డీ బృందాలు ఉన్నాయి. సముద్రానికి మధ్యలో హాప్ ఐలాండ్ దీవిలో ఉన్న 110 మందిని అధికారులు తీరానికి చేర్చారు.
