బిహార్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో విపక్ష కూటమి మహాగఠ్‌బంధన్ మ్యానిఫెస్టో విడుదల చేసింది. ‘తేజస్వీ ప్రతిజ్ఞా ప్రణ్’ పేరుతో ఈ మ్యానిఫెస్టోను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ నేత పవన్ ఖేడా తదితరుల సమక్షంలో విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ తదితర హామీలు ఇందులో పేర్కొన్నారు. బిహార్‌ను అభివృద్ధిపథంలో నడిపించడంతోపాటు దేశంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ వెల్లడించారు.
అంతకుముందు పార్సా, సారణ్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తేజస్వి.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం స్వేచ్ఛగా లభిస్తోందని, ఇంటికే నేరుగా మద్యం సరఫరా అవుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే నిషేధం నుంచి కల్లుకు మినహాయింపు ఇస్తామన్నారు. విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి, సాగునీటిని అందించే ప్రభుత్వాన్ని బిహార్ ప్రజలు కోరుకుంటున్నారని.. గత ఇరవై ఏళ్లలో ఎన్డీయే కూటమి వీటిని చేపట్టలేకపోయిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే వీటిని పూర్తి చేసి చూపిస్తామన్నారు.
‘‘సారణ్‌లో హత్యలు, దోపిడీ, అపహరణలు నిత్యకృత్యమయ్యాయి. అయినప్పటికీ సీఎం నీతీశ్ కుమార్ (Nitish Kumar) పట్టించుకోవడం లేదు. ఒక్కసారి కూడా బాధితులను పరామర్శించలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే శాంతిభద్రతలను కాపాడటంతోపాటు ఉద్యోగాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం’’ అని తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు.
బిహార్‌లో 2016 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు అవుతోంది. మద్యం తయారీ, అమ్మకం, వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ ఉల్లంఘనలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ కూడా తాము అధికారంలోకి వస్తే మద్యం నిషేధాన్ని ఎత్తివేస్తామని ఇదివరకే ప్రకటించింది. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో నవంబర్ 6 తొలిదశ, నవంబర్ 11న రెండోదశలో పోలింగ్ జరగనుంది.
ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా 27 మంది నాయకులపై ఆర్జేడీ వేటు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిహార్ లో రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో ప్రతిపక్ష ఆర్జేడీ (RJD) కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా 27 మంది నాయకులపై వేటు వేసింది. పార్టీ చీఫ్ మంగని లాల్ మండల్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. బహిష్కరణకు గురైన నాయకులను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా సస్పెండ్ చేసినట్లు తెలిపారు. మహాగఠ్‌బంధన్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ తెలిపింది. బహిష్కరణకు గురైన 27 మందిలో ఇద్దరు ఎమ్మెల్యేలు చోటే లాల్‌రాయ్, మహ్మద్ కమ్రాన్‌తో పాటు నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు.
దీనికి ముందు బీజేపీ (BJP) కూడా ఇలాంటి చర్యలే చేపట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఆరుగురు నేతలపై బహిష్కరణ వేటు వేసింది. ఎన్డీయే అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. బీజేపీ బహిష్కరించిన వారిలో ప్రస్తుత ఎమ్మెల్యే పవన్‌యాదవ్ కూడా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో ఆయన స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగారు. రాష్ట్రంలో వచ్చేనెల 6, 11వ తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబరు 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
The post Mahagathbandhan: ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం – మహాగఠ్‌బంధన్ మ్యానిఫెస్టో appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
