Amaravati : అమరావతి, గన్నవరంలలో మెగా టెర్మినళ్లు నిర్మించేందుకు రైల్వేశాఖ ప్రణాళిక సిద్ధంచేసింది. అమరావతి (Amaravati) మీదుగా భవిష్యత్‌లో పెద్దఎత్తున రైళ్ల రాకపోకలు సాగనుండటంతో… వాటికి అనువుగా 8 ప్లాట్‌ఫాంలతో టెర్మినల్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ రైళ్ల నిర్వహణ పనులు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే విజయవాడ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేలా గన్నవరం టెర్మినల్‌ను అభివృద్ధి చేయనున్నారు. వీటితోపాటు విజయవాడ ప్రధాన స్టేషన్, గుంటూరు స్టేషన్ మీదుగా మరిన్ని ఎక్కువ రైళ్ల రాకపోకలకు వీలుగా విస్తరణ పనులు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు.
Amaravati – అమరావతిలో 120 రైళ్ల రాకపోకలకు వీలుగా రైల్ టెర్మినల్
రాజధాని మీదుగా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు 56 కి.మీ. మేర కొత్త రైల్వేలైన్ నిర్మిస్తున్నారు. ఇందులో అమరావతి (Amaravati) ప్రధాన స్టేషన్‌ను మెగా కోచింగ్ టెర్మినల్‌గా నిర్మించనున్నారు. ఓ స్టేషన్ నుంచి ప్రయాణికుల కోచ్‌లతో ఉండే రైళ్లు బయలుదేరినా, ఆ స్టేషన్‌తో రైళ్ల గమ్యస్థానం ముగిసినా.. దానిని కోచింగ్ టెర్మినల్‌గా పేర్కొంటారు. అక్కడితో నిలిచిపోయే రైళ్ల కోచ్‌ల నిర్వహణ పనులు కూడా చేపడతారు. అమరావతిలో (Amaravati) ఇటువంటి టెర్మినల్ నిర్మించనున్నారు. 8 రైల్వే లైన్లు, ఎనిమిది ప్లాట్‌ఫామ్స్ నిర్మిస్తారు. ఒక్కో ప్లాట్‌ఫామ్‌పై 24 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో కూడిన రైళ్లు నిలిచేలా నిర్మిస్తారు. ఈ స్టేషన్ భవిష్యత్‌లో 120 రైళ్ల రాకపోకలకు వీలైన సామర్థ్యం ఉండేలా అభివృద్ధి చేస్తారు. ఈ స్టేషన్‌తో నిలిచిపోయే రైళ్ల నిర్వహణ పనులకు వీలుగా ఆరు పిట్ లైన్లు నిర్మిస్తారు. వాటిలో ఒకటి వందేభారత్ రైలు కోసం కూడా ఉంటుంది. మొత్తంగా ఈ టెర్మినల్ కోసం 300 ఎకరాలు అవసరమని రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
10 ప్లాట్‌ఫామ్స్‌తో గన్నవరం టెర్మినల్
గన్నవరం (Gannavaram) రైల్వే స్టేషన్‌ను కూడా మెగా కోచింగ్ టెర్మినల్‌గా అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం ఈ స్టేషన్‌లో మూడు ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. పరిమితంగా కొన్ని రైళ్లు మాత్రమే ఆగుతున్నాయి. ఇకపై దీనిని విజయవాడకు ప్రత్యామ్నాయ స్టేషన్‌గా అభివృద్ధి చేయనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు చర్లపల్లి వద్ద టెర్మినల్‌ను అభివృద్ధి చేశారు. అదేవిధంగా గన్నవరం మెగా టెర్మినల్ నిర్మిస్తారు. ఇక్కడ మొత్తం 10 రైల్వే లైన్లు, 10 ప్లాట్‌ఫాంలు నిర్మించనున్నారు. ఈ టెర్మినల్ నుంచి 205 రైళ్ల రాకపోకలు ఉండేలా చూడనున్నారు. ఈ స్టేషన్‌తో నిలిచిపోయే రైళ్లకు చెందిన కోచ్‌ల నిర్వహణకు వీలుగా 4 పిట్ లైన్స్ కూడా నిర్మించనున్నారు. గన్నవరం మెగా కోచింగ్ టెర్మినల్‌కు 143 ఎకరాలు కేటాయించాలని రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
మరిన్ని రైళ్ల రాకపోకలకు వీలుగా విజయవాడ స్టేషన్ అభివృద్ధి
విజయవాడ రైల్వేస్టేషన్ మీదుగా ప్రస్తుతం నిత్యం 200 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, దీనిని 300 రైళ్ల సామర్థ్యానికి పెంచేలా అభివృద్ధి చేయనున్నారు. ఇప్పుడున్న 1, 2, 3 లైన్లు చిన్నవిగా ఉన్నాయి. దీంతో 28 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతోగాని, 24 ఐసీఎఫ్ కోచ్‌లతో కూడిన రైళ్లను 2, 3, 4 ప్లాట్‌ఫామ్స్‌పై నిలపలేకపోతున్నారు. దీంతో 1, 2, 3 లైన్లను విస్తరించనున్నారు. ప్రస్తుతం స్టేషన్‌కు కొంత దూరంలో ఉండే రిసెప్షన్ సిగ్నల్ నుంచి రైళ్లు ఏవైనా గంటకు 15 కి.మీ. వేగంతో మాత్రమే స్టేషన్‌లోకి వస్తున్నాయి. ఇకపై రిసెప్షన్ సిగ్నల్ నుంచి కూడా 40-50 కి.మీ. వేగంతో స్టేషన్‌లోకి వచ్చి ప్లాట్‌ఫాంల వద్ద ఆగేలా అభివృద్ధి చేయనున్నారు.
గుంటూరులో మరో కొత్త ప్లాట్‌ఫాం
గుంటూరు స్టేషన్‌లో ప్రస్తుతం ఏడు ప్లాట్‌ఫాంలు ఉండగా, అదనంగా మరోదానిని నిర్మిస్తారు. ప్రస్తుతం ఈ స్టేషన్ మీదుగా 120 రైళ్ల రాకపోకలు సాగించే సామర్థ్యం ఉండగా, దీనిని 170 రైళ్ల సామర్థ్యానికి పెంచనున్నారు.
Also Read : CM Chandrababu: నిర్దిష్ట సమయంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే – సీఎం
The post Amaravati: అమరావతి, గన్నవరంలో మెగా రైల్ టెర్మినళ్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
