Jogi Ramesh : నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను (Jogi Ramesh) పోలీసులు అరెస్టు చేశారు. జోగి రమేష్‌ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు… ఎక్సైజ్ ఆఫీస్‌కు తరలించారు. కల్తీమద్యం కేసులో జనార్దనరావు స్టేట్మెంట్ ఆధారంగా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జోగి రమేష్ ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్‌పై జోగి రమేష్ స్పందించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు.
ఇదిలాఉండగా, జోగి రమేశ్ అరెస్ట్ సమయంలో ఆయన ఇంటి దగ్గర వైసీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్దకు పోలీసులు ఉదయమే వెళ్లారు. ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం (Liquor Case) తయారు చేశానని సిట్ అధికారుల విచారణలో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు వెల్లడించిన విషయం కూడా తెలిసిందే. జోగి రమేష్ (Jogi Ramesh) తనకు ఆర్థికంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చాడని, అయితే ఆ తర్వాత పట్టించుకోలేదని జనార్ధన్ రావు అధికారులకు తెలియజేశారు.
Jogi Ramesh – పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు – జోగి రమేష్ భార్య శకుంతల
ఏపీలో నకిలీ మద్యం వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) పాత్ర ఏమీ లేదన్నారు ఆయన సతీమణి శకుంతల. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కావాలనే జోగి రమేష్‌ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేసినా దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగి రమేష్ సతీమణి శకుంతల మాట్లాడుతూ… ‘చంద్రబాబు ఇంటికి వెళ్లినప్పటి నుంచి ఆయన, నారా లోకేష్ కక్ష పెట్టుకున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధిస్తున్నారు. గతంలో అగ్రిగోల్డ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు నకిలీ మద్యం (Liquor Case) వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఏమీ లేదు. కావాలనే ఈ కేసులో పోలీసులు ఇరికించారు. దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేశాం. ఇవాళ ఉదయాన్నే మా ఇంటిని వచ్చిన పోలీసులు.. తలుపులు మూసేసి దౌర్జన్యంగా వ్యవహరించారు. పైన దేవుడు ఉన్నాడు.. అందరికీ కుటుంబాలు ఉన్నాయి. దేవుడు అన్నీ చూసుకుంటాడు. మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. జోగి రమేష్ (Jogi Ramesh) కుమారుడు రాజీవ్ మాట్లాడుతూ… ‘పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వలేదు. మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య. నకిలీ మద్యం కేసుపై సీబీఐ విచారణ జరపాలి. మా నాన్నకు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సహా ఆయన సోదరుడు జోగి రాము, ఆయన సహచరుడు రామును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
చంద్రబాబూ అంత భయమెందుకు? – వైఎస్ జగన్
మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడానికి, నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ జోగి రమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. నకిలీ మద్యం కేసులో టీడీపీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబు అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగిరమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగిరమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.
గత 18 నెలలుగా ప్రభుత్వం మీది.. పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డవారిలో మీ పార్టీనుంచి ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు, మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ, అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే. మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అంతా అమ్మేది, మీరు తీసుకు వచ్చిన మీ ప్రైవేటు లిక్కర్ షాపుల్లోనే, మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్టుషాపుల్లోనే, పర్మిట్ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీవారు, అమ్మేదీ మీరే, కాని బురదజల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మావాళ్లని.
నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడానికి, మోంథా తుపాను కారణంగా కుదేలైన రైతు గోడును పక్కదోవపట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి, దుర్మార్గానికి ఒడిగట్టారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటిరోజే అరెస్టుకు దిగారంటే చంద్రబాబుగారు.. మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోంది. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబుగారూ? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెప్తే అది చేస్తుంది. మీరు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమి ఆశించగలం’ అని విమర్శలు చేశారు.
Also Read : CM Revanth Reddy: ఒక్క అవకాశం ఇవ్వండి – జూబ్లీహిల్స్ రోడ్ షో లో సీఎం రేవంత్‌రెడ్డి
The post Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
