ప్రపంచాన్ని గెలిచే శక్తి ఉత్తరాంధ్రకు ఉందని.. అందుకు వనరుగా భోగాపురం విమానాశ్రయం ఉపయోగపడాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం నాడు భోగాపురం విమానాశ్రయ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఎ. ఆర్. దామోదర్ స్థానిక ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం మాధవి, మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిలతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. రెండు నెలల క్రితం సెప్టెంబర్ 13న తాను పరిశీలనకు వచ్చేసరికి విమానాశ్రయ నిర్మాణ పనులు 86.61 శాతం పూర్తి అవ్వగా.. నేడు.. 91.70 శాతానికి చేరుకోవడం జరిగిందని తెలిపారు.
కూటమి సర్కారు ఏర్పడిన తొలిరోజుల్లో… తాను కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. ఒక ఛాలెంజ్ గా ప్రాజెక్ట్ తీసుకోమన్నారని.. దానికి ధీటుగానే ఆయన చెప్పిన డెడ్ లైన్ డిసెంబర్ 2026 కన్నా ముందుగానే వచ్చే సంవత్సరం జూన్ నాటికి విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా కేవలం 8.3 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని.. ఈలోగా ఈ డిసెంబర్, జనవరి నాటికి వ్యాలీడేషన్ ఫ్లైట్ ను నడపనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను ఆహ్వానించనున్నట్టు తెలిపారు. భోగాపురం కు బీజం పడిన తొలి రోజుల్లో ఇక్కడ యువత ఆలోచనలో మార్పు వచ్చిందని.. రియల్ ఎస్టేట్, ఇతర రంగాలు కూడా వృద్ధి చెందాయని.. విమానాశ్రయం ప్రారంభం అయ్యాక మరింతగా ఆర్థిక అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు.
స్థానికంగా ఏవియేషన్ యూనివర్సిటీకి కూడా చంద్రబాబు నాయుడు ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. గడచిన పద్ధెనిమిది నెలలలో ప్రధాని మోదీ మార్గదర్శనం లో దేశంలో అనేక చోట్ల విమానాశ్రయాలు నెలకొల్పామని.. అంతకు మించిన వృద్ధిని భోగాపురంలో చూస్తామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటు అయితే ఆ అభివృద్ధి ప్రభావం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై స్పష్టంగా ఉంటుందని తెలిపారు.
విమానాశ్రయాల నిర్మాణం సమయంలో కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ నిశితంగా పరిశీలన చేస్తుందని.. నావిగేషన్, ట్రాఫిక్ కంట్రోల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర అంశాల్లో నాణ్యత, పరిధి అంశాలను తన శాఖ సిబ్బంది నిరంతరం సమీక్షిస్తూ ఉంటారని తెలిపారు. ఇప్పటికే పలు దఫాలుగా తన శాఖ తరపున సమీక్షలు జరుగగా.. తాను కూడా క్షేత్ర స్థాయిలో ఇప్పటికే అనేక సార్లు పర్యటనలు జరిపానని.. జరుగుతున్న పనుల తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పటికే అనేక ఎయిర్లైన్ సంస్థలతో కూడా మాట్లాడమని.. వైజాగ్ నుండి విమానాశ్రయం ఇక్కడకు మారిన తరువాత కనెక్టివిటీ తరిగిపోతుంది అన్న అనుమానం అవసరం లేదని స్పష్టం చేశారు. నైట్ పార్కింగ్, ఇతర వసతులను ఏర్పాటు చేసి.. ఇంతవరకు వైజాగ్ నుండి తన కార్యకలాపాలు ప్రారంభించని ఆకాసా, స్పైస్ జెట్, ట్రూ జెట్ సర్వీసులను కూడ అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని.. స్పష్టం చేశారు. అనేక ప్రాంతాలకు కనెక్టివిటీ ఇక్కడి నుండి సాకారం చేస్తామని తెలిపారు.
15 బిలియన్ డాలర్ల వ్యయంతో ఏర్పాటు అవుతున్న గూగుల్ డేటా సెంటర్ ప్రారంభమయ్యాక.. దానికి సమానంగా ఇతర కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్థానికంగా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. భోగాపురం ఆ కళను సాకారం చేస్తుందని తెలిపారు. 14,15 తేదీల్లో ఇన్వెస్టర్ సమ్మిట్ విశాఖలో జరగనుందని.. విమానయాన శాఖకు సంబంధించి కూడా స్థానికంగా అభివృద్ధికి 500 ఎకరాలు అందుబాటులో ఉంచిన నేపథ్యంలో.. అందుకోసం సమ్మిట్ లో ప్రెజెంటేషన్ కూడా సిద్ధం చేసినట్టు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
భోగాపురం, శ్రీకాకుళం లో ఏవియేషన్ రంగానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని.. తద్వారా భవిష్యత్ లో ఇక్కడ లభించే ఉపాధికి కూడా స్థానిక యువత సిద్ధంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. అల్లూరు సీతారామరాజు పేరుతోనే విమానాశ్రయం ప్రారంభం అవుతుందని స్పష్టంచేశారు. ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా .. ప్రపంచమే గర్వించేలా భోగాపురం విమానాశ్రయం నిర్మాణం అవుతోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ విమానాశ్రయ ఏర్పాటు ద్వారా ఉత్తరాంధ్ర అంటేనే గర్వం, గౌరవం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకప్పుడు విమానయాన శాఖ మంత్రిగా చేసిన అశోక్ గజపతిరాజు.. భోగాపురం కు బీజం వేసినట్టు గుర్తు చేశారు. స్థానిక గ్రామాలకు కూడా డ్రైనేజీ, కనెక్టివిటీ ఇబ్బందులు లేకుండా చేస్తామని, ఎవ్వరు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిఎంఆర్ అధికారులు, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
The post Kinjarapu Rammohan Naidu: దేశం గర్వించేలా భోగాపురం విమానాశ్రయం – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
