ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025’ అందుకున్నారు. లండన్‌లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్‌లో భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 1.30 సమయంలో జరిగిన కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐవోడీ) సంస్థ ప్రతినిధులు ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ‘ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్’ విభాగంలో లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డునూ ఆ సంస్థ వీసీఎండీ అయిన భువనేశ్వరికి ఇదే వేదికపై అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్టు నిర్వహిస్తున్న పలు సేవాకార్యక్రమాల గురించి వివరించారు. సంజీవని ఫ్రీ హెల్త్ క్లీనిక్స్, మొబైల్ హెల్త్ క్యాంప్స్, సురక్షితమైన తాగునీరు అందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వటంతో పాటు వారి సామర్ధ్యాలు పెంచేలా నైపుణ్య శిక్షణను అందిస్తూ మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలోనూ బాధితులకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. వారి జీవితం సాధారణ స్థాయికి వచ్చే వరకూ చేయూతను అందిస్తున్నామని అన్నారు.
ఏపీ, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆపన్నులకు సాయం అందిస్తున్నామని భువనేశ్వరి ఈ సందర్భంగా తెలిపారు. సమాజంలో ప్రజలు సక్రమంగా పోషకాహారం తీసుకునేలా ట్రస్టు తరపున సేవలు అందిస్తున్నామని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు సంబంధిత అంశాల్లో సలహాలు అందిస్తున్నామని చెప్పారు. వ్యక్తిగత ఆరోగ్యం కాపాడుకునేలా వారికి ట్రస్టు తరపున విలువైన సూచనలు చేస్తున్నామని వివరించారు. సమాజంలో అందరికీ సమాన అవకాశాలు లభించాలన్నదే ఎన్టీఆర్ ట్రస్టు ఆశయమని అన్నారు. ఈ దిశగా అట్టడుగున ఉన్నవారు కూడా గౌరవంతో జీవించేలా అవసరమైన అంశాల్లో వారిని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. సముద్రంలా అందరికీ వనరుల్ని, సూర్యుడిలా సమాజంలో అందరికీ సమానంగా సేవల్ని అందిస్తూ ఎన్టీఆర్ ట్రస్టు ముందుకు సాగుతోందని నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ప్రజాసేవ- సామాజిక సాధికారత రంగాల్లో చేసిన విశేష కృషికిగానూ భువనేశ్వరికి ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025’ పురస్కారాన్ని అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, మహిళా సాధికారత, విపత్తుల్లో సహాయం తదితర అంశాల్లో ఆమె విస్తృత సేవలందిస్తున్నారు. రక్తదాన శిబిరాలు, విద్యార్థి సహాయ పథకాలు, మహిళల ఆర్థిక స్వావలంబన వంటి సేవా కార్యక్రమాలు అమలుచేస్తూ ప్రజల మన్ననలు పొందారు. తలసేమియా రోగులకు ఉచితంగా రక్తమార్పిడి చేయిస్తున్నారు. దీనిపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలూ నిర్వహించారు.
దేశంలోనే ప్రతిష్ఠాత్మక డెయిరీ బ్రాండ్‌గా హెరిటేజ్‌ను తీర్చిదిద్దడం, ఆ సంస్థ ఎదుగుదల, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు, కోట్ల మంది వినియోగదారులకు ఆ ఉత్పత్తులు చేరువయ్యేలా చేయడంలో భువనేశ్వరిది క్రియాశీలక పాత్ర. ఈ సంస్థ కార్యకలాపాల ద్వారా రైతుల సాధికారతకు ఆమె పెద్దపీట వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును ఆ సంస్థ వీసీఎండీ హోదాలో భువనేశ్వరి అందుకున్నారు.
The post Nara Bhuvaneshwari: ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025’ అవార్డు అందుకున్న నారా భువనేశ్వరి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
