Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

CM Revanth Reddy: కేసీఆర్‌ కు భవిష్యత్తు లేదు – సీఎం రేవంత్‌రెడ్డి

Ai generated article, credit to orginal website, November 11, 2025

 
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు గతమే ఉంది… భవిష్యత్తు లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తన కళ్ల ముందే పార్టీ కూలిపోతోంటే.. కేసీఆర్‌ ఆవేదనలో ఉన్నారు. అందుకే బయటకు రావడం లేదన్నారు. ప్రతిపక్ష నేత రెండేళ్లుగా శాసనసభకే రాలేదు. టీచర్‌ లేని బడిలాగా తయారైంది భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం. ప్రతి వస్తువుకూ నిర్ణీత కాలపరిమితి ఉంటుంది. అలా భారత రాష్ట్ర సమితి కూడా కాలగర్భంలో కలిసిపోతోంది. అందుకే జూబ్లీహిల్స్‌లో భారత రాష్ట్ర సమితిని గెలిపించాలని విజ్ఞప్తి చేయలేదు. ఆయనను సానుభూతితో చూడాల్సిందే తప్ప… ప్రత్యర్థిగా చూసే పరిస్థితులు లేవన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
 
‘‘తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే 1.15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలున్నాయని చెప్పిన అప్పటి సీఎం కేసీఆర్‌… పదేళ్లలో ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదు? సాగునీటి ప్రాజెక్టుల కోసం కాంట్రాక్టర్లకు రూ.1.86 లక్షల కోట్లు చెల్లించారు. కానీ, ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు. రూ.లక్షల కోట్లు ఎక్కడికి వెళ్లాయి? రూ.1.02 లక్షల కోట్ల బిల్లులు చెల్లించిన కాళేశ్వరం… మూడేళ్లలో కూలేశ్వరం అయిపోయింది. దాంతో ఒక్క ఎకరాకైనా అదనంగా నీళ్లిచ్చారా? అని ప్రశ్నించారు.
కేసీఆర్‌ అధికారంలో ఉండగా.. ఏడాదికి రూ.2 లక్షల కోట్ల చొప్పున రూ.20 లక్షల కోట్ల బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. అయినా ఒక్క నూతన విద్యాసంస్థ అయినా తీసుకొచ్చారా? యూనివర్సిటీలకు వీసీలనైనా నియమించారా? వాళ్లు నిర్మించిన సచివాలయం, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్, ప్రగతిభవన్‌లతో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా? 500 ఏకోపాధ్యాయ పాఠశాలలను మూసివేశారు. పేదలకు విద్యను, రైతులకు వ్యవసాయాన్ని, మహిళలకు రాజ్యాధికారాన్ని దూరం చేశారు. ఐదేళ్లపాటు మంత్రివర్గంలో మహిళలకు స్థానమే ఇవ్వలేదు. మొత్తంగా.. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర సాధన ఆత్మనే కేసీఆర్‌ చంపేశారు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన ‘మీట్‌ ద ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
అభివృద్ధికి చిరునామా – కాంగ్రెస్‌
‘‘కాంగ్రెస్‌ అంటేనే అభివృద్ధికి చిరునామా. 2004 నుంచి 2014 వరకూ కేంద్రంలో మన్మోహన్‌సింగ్‌ సారథ్యంలో మా పార్టీ అధికారంలో ఉంది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత… రైతులకు ఉచిత విద్యుత్‌ సరఫరా, వారిపై పెట్టిన క్రిమినల్‌ కేసుల ఎత్తివేత, రైతుల బకాయిల రద్దుపై మొదటి సంతకం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. మన్మోహన్‌ ప్రభుత్వం రూ.72 వేల కోట్ల రుణమాఫీ చేసింది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించింది. హైదరాబాద్‌కు ఉపాధి కోసం వస్తున్న ప్రజల అవసరాల కోసం… ప్రధానంగా తాగునీటి అవసరాలు తీవ్రమైనప్పుడు.. ఆనాటి సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేతగా ఉన్న పీజేఆర్‌ అసెంబ్లీలో అలుపెరుగని పోరాటం చేశారు. నాగార్జునసాగర్‌ నుంచి కృష్ణా జలాలను హైదరాబాద్‌కు తరలించడానికి కృషి చేశారు. జంట నగరాలకు నిరంతరాయంగా విద్యుత్‌ అందించేందుకు ఆనాటి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంతో విప్రో, ఇన్ఫోసిస్, గూగుల్‌ వంటి దిగ్గజ ఐటీ సంస్థలు హైదరాబాద్‌కు తరలివచ్చాయి. దేశం ఉత్పత్తి చేస్తున్న బల్క్‌ డ్రగ్స్‌లో 40% హైదరాబాద్‌ నుంచే వస్తున్నాయి.
నేదురుమల్లి జనార్దనరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పునాదిరాయి వేసిన హైటెక్‌ సిటీ, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కొనసాగించిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు, కృష్ణా, గోదావరి తాగునీటి జలాలు, ఐఎస్‌బీ, నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం, ఐఐఐటీ వంటి విద్యాసంస్థలు హైదరాబాద్‌ అభివృద్ధికి దోహదపడ్డాయి. ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇళ్లు, దళితులు, గిరిజనులకు ఎసైన్డ్‌ భూముల పంపిణీ వంటివి కాంగ్రెస్‌ ప్రభుత్వమే అమలు చేసింది. ఆదాయాన్ని, ఉద్యోగాలను, పరోక్ష ఉపాధిని అందించే ప్రణాళికలను మేం తీసుకొచ్చాం. మేం సంపాదించిందంతా ఖర్చు పెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి మోదీ, కేసీఆర్‌ ప్రయత్నించారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ కారిడార్‌ మేమిచ్చాం. దాంతో కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేవి. మోదీ, కేసీఆర్‌ కలిసి దాన్ని రద్దుచేశారు. కేవలం రూ.7,500 కోట్లకు 160 కి.మీ. ఓఆర్‌ఆర్‌ను కేసీఆర్‌ అమ్మేశారు.
భారత రాష్ట్ర సమితి హయాంలో నిర్మాణాల్లో అవినీతి
 
భారత రాష్ట్ర సమితి హయాంలో రూ.60 కోట్లతో నిర్మాణం మొదలుపెట్టి రూ.250 కోట్లకు వ్యయం పెంచి, అవినీతికి పాల్పడిన అమరవీరుల స్తూపం నెర్రెలు బారింది. అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణంలో రూ.200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. రూ.400 కోట్లతో సచివాలయం నిర్మాణాన్ని మొదలుపెట్టి రూ.2 వేల కోట్లు ఖర్చుపెట్టారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ని రూ.300-400 కోట్లతో ప్రారంభించగా… నిర్మాణ వ్యయం రూ.1,200-1,300 కోట్లకు పెరిగిపోయింది. ప్రగతిభవన్‌కు గద్దర్‌ వెళ్తే.. ఎర్రటి ఎండలో బయట నిలబెట్టారు. సామాన్యులకు ప్రవేశం లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకోలేదు. అల్వాల్, ఎల్బీనగర్, సనత్‌నగర్‌ టిమ్స్‌ ఆసుపత్రులు సహా వరంగల్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని అర్ధాంతరంగా వదిలేశారు. ఎవరి ప్రయోజనం కోసం… ఎవరిపై నిఘా పెట్టడానికి… అత్యంత వేగంగా సచివాలయం, ప్రగతిభవన్‌ నిర్మాణాలు పూర్తిచేశారు?
రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్, రూ.69 వేల కోట్ల అప్పుతో మేం 2014లో కేసీఆర్‌కు తెలంగాణను అప్పజెప్పాం. రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించి… 2023 డిసెంబరులో రూ.8.11 లక్షల కోట్ల అప్పుతో.. జీతభత్యాలూ ఇవ్వలేని ఆర్థిక దుస్థితిలో మాకు అప్పజెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ నిర్మాణం రూ.2,000 కోట్లతో పూర్తయ్యేది. దాన్ని కేసీఆర్‌ పక్కనబెట్టారు. మేం పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే శాపనార్థాలు పెడుతున్నారు. ప్రమాదంలో కార్మికులు మరణిస్తే ఎవరైనా ఆనందపడతారా? ఇదేం విషసంస్కృతి? పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జూబ్లీహిల్స్‌లోని మురికివాడలను ఎందుకు బాగుచేయలేదు? అప్పట్లో పురపాలక మంత్రిగా ఉన్న కేటీఆర్‌ అందుకు బాధ్యులు కాదా?
అభివృద్ధి పనులు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు అడగడం లేదు
 
ఎవరిది అగ్రికల్చర్‌? ఎవరిది డ్రగ్స్‌ కల్చర్‌? ఇవ్వాళ గల్లీగల్లీలో గంజాయి, డ్రగ్స్‌కు కారణమెవరు? ఎవరిది పబ్‌ కల్చర్‌? ఎవరిది సామాన్యులతో కలిసిపోయే కల్చర్‌? ఎవరు సినీ కార్మికులతో కలిసి కూర్చొని మాట్లాడుతున్నారో పోల్చిచూడండి. జూబ్లీహిల్స్‌ ఓటర్లు విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలి. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ గెలిచాక… 30 ఏళ్లపాటు పెండింగ్‌లో ఉన్న కంటోన్మెంట్‌-శామీర్‌పేట ఎలివేటెడ్‌ కారిడార్‌కు, మేడ్చల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌కు డిఫెన్స్‌ భూములను సాధించి… రూ.5 వేల కోట్ల పనులు ప్రారంభించుకున్నాం. పాతబస్తీలో ఎమ్మెల్యేలు సహకరిస్తే… గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్టకు మెట్రో విస్తరణ పనులు ప్రారంభించాం. మీరా ఆలం వద్ద రూ.500 కోట్లతో తీగల వంతెన పనులు ప్రారంభమయ్యాయి. ఎక్కడెక్కడ ప్రజాప్రతినిధులు మా దృష్టికి తీసుకొస్తున్నారో… అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఒక్కసారి కూడా అభివృద్ధి పనులు కావాలని అడగడం లేదు. జనజీవన స్రవంతిలోకి రావాలని మావోయిస్టు మిత్రులను కోరాను. వారి ఆలోచనల ప్రకారం.. పేదలకు పరిపాలన అందిస్తామని చెప్పా.
ఏకగ్రీవ సంప్రదాయాన్ని తుంగలో తొక్కిందే కేసీఆర్‌
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో భారత రాష్ట్ర సమితి సెంటిమెంట్‌ను వాడుతోంది. పీజేఆర్‌ చనిపోయినప్పుడు.. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏకగ్రీవానికి సహకరించారు. కేసీఆర్‌ మాత్రం అభ్యర్థిని నిలిపారు. ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్న రాంరెడ్డి వెంకట్‌రెడ్డి చనిపోతే.. ఆయన సతీమణిపై పోటీపెట్టి ఓడించారు. ఏకగీవ్ర సంప్రదాయాన్ని తుంగలో తొక్కిందే కేసీఆర్‌. హైదరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. పదేళ్లపాటు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుంది. ప్రణాళికలు రచించుకొని అభివృద్ధి చేసుకుందాం. కొన్నింటికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాల్సి ఉంది. మూసీ రివర్‌ ఫ్రంట్‌లో నైట్‌ ఎకానమీని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ సమస్యను పరిష్కరించుకోవడంపైనా దృష్టి పెట్టాం. 2026 మార్చి 31లోగా ఆర్థిక అంశాలపై పారదర్శక డాక్యుమెంట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చిస్తాం.
నాది కార్యకర్త మనస్తత్వం
నేను మొదట కాంగ్రెస్‌ కార్యకర్తను. నాది నాయకుడి మనస్తత్వం కాదు… కార్యకర్త మనస్తత్వం. పార్టీ ఎన్నికలో నిలబడితే… ఇంట్లో కూర్చోను. స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి… సమస్యలను తెలుసుకుంటాను. ప్రజల స్పందనను గమనిస్తాను. జూబ్లీహిల్స్‌లో రూ.300 కోట్ల పనులు జరుగుతున్నాయి. కొత్త రేషన్‌కార్డులిచ్చాం. 4 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పా. సినీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్న పోలీస్‌ స్కూల్‌లో సహేతుకమైన ఫీజుతో కొంత శాతం కోటా సీట్లను జర్నలిస్టుల పిల్లలకు కేటాయించేలా చర్యలు తీసుకుంటాం. చేసిన అభివృద్ధిని చెప్పుకోవడంలో కొంత వెనుకబడ్డాం. జూబ్లీహిల్స్‌ ఫలితం వంద శాతం మా వైపే ఉంటుంది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ ఛైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వరికుప్పల రమేశ్‌ తదితరులు పాల్గొనగా.. సీనియర్‌ జర్నలిస్ట్‌ రవికాంత్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.
The post CM Revanth Reddy: కేసీఆర్‌ కు భవిష్యత్తు లేదు – సీఎం రేవంత్‌రెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • 23 people killed in Goa nightclub fire
  • 23 people killed in Goa nightclub fire
  • From Village Leadership to State Power: How Sarpanches Shaped Karimnagar’s Political Legacy
  • From Village Leadership to State Power: How Sarpanches Shaped Karimnagar’s Political Legacy
  • Exclusive: Mahesh Babu’s Pay for Varanasi

Recent Comments

No comments to show.

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2025 Information Bazaar | WordPress Theme by SuperbThemes