బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తేవాల్సిన బాధ్యత రాష్ట్ర యువతపై ఉందని ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ‘ఒక్క ఛాన్స్ పేరుతో 2019లో ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం వల్ల… రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. అలాంటి పరిస్థితులు బిహార్‌లో తెచ్చుకోవద్దు’ అని కోరారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్నాలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో లోకేశ్ మాట్లాడారు.
‘వికసిత భారత్ లక్ష్యసాధనలో బిహార్ పాత్ర చాలా కీలకం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎన్డీయేకు అధికారం ఇవ్వాలి. రాష్ట్రాలు బలంగా ఉంటేనే భారతజాతి బలోపేతమవుతుంది’ అని పేర్కొన్నారు. ‘బిహార్‌లోని ఒక పార్టీ ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెబుతోంది. ఆచరణ సాధ్యం కాని హామీలను యువత నమ్మొద్దు. డబుల్ ఇంజిన్ సర్కారు కారణంగానే బిహార్, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి పెద్దఎత్తున నిధులు లభిస్తున్నాయి’ అని వివరించారు. – విలేకరుల సమావేశంలో భాజపా మీడియా విభాగం కో-హెడ్, ఎమ్మెల్సీ సంజయ్ మయూక్, ఎంపీలు సానా సతీశ్, గంటి హరీశ్, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో నారా లోకేశ్ భేటీ
బీజేపీ బిహార్ ఎన్నికల వ్యవహారాల బాధ్యుడు, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో లోకేశ్ ఆదివారం పట్నాలో భేటీ అయ్యారు. ఎన్నికల్లో ఎన్డీయే విజయానికి ఆయన చేస్తున్న కృషిని అభినందించారు. లోకేశ్ వెంట ఎంపీలు సానా సతీశ్, గంటి హరీశ్, కలిశెట్టి అప్పలనాయుడు తదితరులున్నారు. ఎన్డీయే అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఈ దఫా చంద్రబాబుకు బదులు లోకేశ్‌ను ఆహ్వానించడం విశేషం.
బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వాన్ని 3 అంశాల ప్రాతిపదికగా గెలిపించాలి – లోకేశ్
1. స్వచ్ఛమైన, అవినీతిరహిత పాలన కోసం ఎన్డీయే మళ్లీ గెలవాలి. నరేంద్ర మోదీ బిహార్ రూపురేఖలు మార్చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే ఆయన లక్ష్యం. ఇక్కడ నరేంద్రమోదీ, నీతీశ్‌కుమార్ నాయకత్వం ఉంది. ఏపీలో మోదీ, చంద్రబాబు నాయకత్వం ఉంది. విజన్, సమర్థతతో వీరు పాలన చేస్తున్నారు.
2. ఎన్డీయే ప్రభుత్వంలో శాంతిభద్రతలు బాగుంటాయి. అభివృద్ధికి పెద్దఎత్తున అవకాశాలు వస్తాయి. బిహార్, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వాలు ఉండడంతో మౌలిక సౌకర్యాల కల్పన, విద్యాసంస్థల ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తోంది. కేంద్రం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో రాష్ట్రాల్లోని ఎన్డీయే ప్రభుత్వాల పాత్ర ఉంటోంది. వివిధ పరిశ్రమలు రావడానికి కేంద్రం మద్దతు లభిస్తోంది.
3. గుజరాత్, ఒడిశాల్లో ప్రభుత్వాల కొనసాగింపు వల్ల పెద్దఎత్తున అభివృద్ధి సాధించాయి. బిహార్‌లో జంగిల్‌రాజ్ పాలన పోయి నీతీశ్‌కుమార్ ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు బాగున్నాయని, ఎంతో అభివృద్ధి జరిగిందని పరిశ్రమల సంఘం ప్రతినిధులు చెప్పారు. ఏపీలోనూ చంద్రబాబు ఇంటికో పారిశ్రామికవేత్త నినాదం ప్రకటించారు. సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు.
The post Nara Lokesh: ఎన్డీయేను తిరిగి గెలిపించాలి – మంత్రి లోకేశ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
