ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలో వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని పెట్టుబడులకున్న అవకాశాలను వివరించడంతోపాటు.. పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నారు. అలాగే ప్రతిపాదనలతో వచ్చిన వారితో ఈడీబీతో ఎంఓయూలు కుదుర్చుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఎరువులు, అగ్రి-ఇన్‌పుట్ సంస్థ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎరువుల తయారీ విస్తరణ, గ్రీన్ అమోనియా, అగ్రిటెక్ ప్రాజెక్టులపై ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. మురుగప్ప గ్రూప్‌కు చెందిన కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థకు ఇప్పటికే విశాఖపట్నం, కాకినాడలో ఎరువుల ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి.
దీనికి కొనసాగింపుగా మరో రూ.2,000 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో ఎరువుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. గ్రీన్ అమోనియా – గ్రీన్ హైడ్రోజన్ తయారీ, ఎరువుల ఉత్పత్తి యూనిట్ విస్తరణ సహా ఇంకొన్ని ప్రాజెక్టులపై కోరమండల్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. మరోవైపు ప్రముఖ ఫర్నిచర్ సంస్థ బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ ఛైర్మన్ ఎన్‌కే అగర్వాల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. కలప ఆధారిత ఇంజినీర్డ్ ప్యానెల్ తయారీ యూనిట్ ఏర్పాటుపై చర్చించారు. అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్నా క్యాంటిన్ల నిర్వహణకు ఎన్‌కే అగర్వాల్ రూ.1 కోటి విరాళాన్ని ముఖ్యమంత్రికి అందించారు.
రూ.15వేల కోట్ల పెట్టుబడితో 4 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి హీరో గ్రూప్ ఎంఓయూ
4 గిగావాట్ల పునరుద్పాతక విద్యుత్ రంగంలో పెట్టుబడులకు హీరో ప్యూచర్ ఎనర్జీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.15 వేల కోట్ల వ్యయంతో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఈ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ సీఎండీ రాహుల్ ముంజాల్ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. సీఎం సమక్షంలో ఈ పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ -ఈడీబీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సీఎండీకి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గ్రీన్ ఎనర్జీ, హైబ్రీడ్ సొల్యూషన్స్ రంగాల్లోనూ పెట్టుబడులతో ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు. డెడికేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ పార్క్ ఏర్పాటు చేయాలని సూచించారు.
మరోవైపు రామాయపట్నం వద్ద అత్యాధునిక ఫర్నిచర్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు స్వీడన్ కు చెందిన జూల్ గ్రూప్ ముందుకు వచ్చింది. ఆ సంస్థ ఫౌండర్ సీఈఓ టామ్ ఓలాండర్ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. రూ.300 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయనున్నామని జూల్ సంస్థ తెలిపింది. నార్వే, స్వీడన్ల నుంచి భారీ దుంగలను దిగుమతి చేసుకుని డోర్లు, విండోలు లాంటి ఉత్పత్తులతో పాటు ప్రీ ఫాబ్రికేషన్ విధానంలో ఇళ్లను కూడా రూపొందిస్తామని జూల్ సీఈఓ టామ్ ఓలాండర్ సీఎం చంద్రబాబుకు వివరించారు.
దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రామాయపట్నం పోర్టు సమీపంలో 500 ఎకరాల్లో ఫర్నిచర్ క్లస్టర్ సిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అమరావతి నగరంతో పాటు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని సీఎం వెల్లడించారు. అనంతరం ప్రముఖ ఆటబొమ్మల తయారీ సంస్థ పాల్స్ ప్లష్ టాయ్స్ సంస్థ అధ్యక్షుడు అజయ్ సిన్హా ముఖ్యమంత్రిని కలిసి అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద టాయ్ పార్క్ ఏర్పాటుపై చర్చించారు. చైనా తరహాలో ఆట బొమ్మల తయారీకి సంబంధించిన ఎకోసిస్టంను తయారు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం బొమ్మల తయారీలో స్థానికంగా ఉన్న మహిళలకు ఉపాధి కల్పించాలని సీఎం ఆ సంస్థ ప్రతినిధుల్ని కోరారు.
The post Coromandel Fertilizers: రూ.2,000 కోట్ల పెట్టుబడితో ఎరువుల తయారీకు కోరమండల్ సంసిద్దత appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
