హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సినిమా టికెట్ల ధరల సమస్యపై ఎలాంటి సమాచారం లేదన్నారు. పుష్ప-2 సినిమా తర్వాత బెనిఫిట్ షో, సినిమా టికెట్ల ధరలను పెంచాలని కోరుతూ తనను సంప్రదించ వద్దని తాను నిర్మాతలకు స్పష్టంగా చెప్పానని అన్నారు. అందుకే ఆ విషయం గురించి తనను అడగ వద్దని కోరారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రస్తుతానికి సినిమా శాఖను చూస్తున్నప్పటికీ తాను అంతగా వాటి జోలికి వెళ్లడం లేదని చెప్పారు. కొందరు కావాలని పదే పదే తనను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
పదే పదే తనపై లేనిపోని ఆరోపణలు చేయడం, నిరాధారమైన వార్తలను , కథనాలను ప్రసారం చేస్తూ తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా చేస్తున్నారంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వాపోయారు. మంత్రిగా ఉన్నా సినీ పరిశ్రమ అంటేనే విసుగు వచ్చిందన్నారు. అందుకే తాను సినీ పరిశ్రమ గురించి ఆలోచించడం మానేశానని స్పష్టం చేశారు. తనపై వస్తున్న వదంతులపై స్పష్టత ఇచ్చేందుకు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గతంలో విడుదలైన రెండు సినిమాలకు, శుక్రవారం విడుదలైన మరో సినిమాకు, సోమవారం విడుదల కాబోయే ఇంకో సినిమాకు టికెట్ల ధరలు పెంచడానికి సంబంధించిన ఏ ఫైల్ కూడా నాకు అందలేదని బాంబు పేల్చారు. ఓ ఐఏఎస్ అధికారిణితో తనకు లింకు ఉందంటూ ఓ ఛానల్ ప్రసారం చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
The post సినిమా టికెట్ల ధరల సమస్యలపై సమాచారం లేదు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
