Trump Tariffs | ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం టారిఫ్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌పై ఏ మేర ప్రభావం చూపిస్తుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రష్యాతో చమురు కొనుగోళ్ల కారణంగా 50 శాతం సుంకాలు విధిస్తామనే హెచ్చరికలు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో.. తాజా నిర్ణయం మరో ఆర్థిక ఒత్తిడే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇరాన్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా ఉన్నప్పటికీ.. భారత్ కూడా కీలకమే. భారత రాయబార కార్యాలయం (టెహ్రాన్) గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇరాన్‌కు భారత్ 1.24 బిలియన్ డాలర్ల విలువైన సరుకులను ఎగుమతి చేసింది. అదే సమయంలో ఇరాన్ నుంచి 0.44 బిలియన్ డాలర్ల సరుకులను దిగుమతి చేసుకుంది. అంటే గత ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య మొత్తం 1.68 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. భారత కరెన్సీలో చెప్పాలంటే.. ఇది సుమారు రూ.14వేల కోట్ల నుంచి 15 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.
భారత్ నుంచి ఇరాన్‌కు వెళ్లిన ఎగుమతుల్లో ఆర్గానిక్ కెమికల్స్ అగ్రస్థానంలో ఉన్నాయి. వీటి విలువ 512.92 మిలియన్ డాలర్లు. అలాగే పండ్లు, డ్రైఫ్రూట్స్, సిట్రస్ పండ్ల తొక్కలు, మెలాన్లు వంటి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి 311.60 మిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. ఖనిజ ఇంధనాలు, ఆయిల్స్, డిస్టలేషన్ ఉత్పత్తులకు సంబంధించి 86.48 మిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. ఒకవేళ ఈ రంగాలపై అమెరికా టారిఫ్‌ల ప్రభావం పడితే, భారత ఎగుమతిదారులకు నష్టాలు తప్పవని వ్యాపారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే 50 శాతం టారిఫ్!
రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికే భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం వరకు టారిఫ్‌లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ వ్యాపారంపై కూడా అదనపు టారిఫ్‌లు విధిస్తే.. అమెరికా – భారత్ వాణిజ్య చర్చలు మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా టారిఫ్‌ల సడలింపు కోసం ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఇలాంటి తరుణంలో ట్రంప్ తాజా నిర్ణయం ఆ ప్రయత్నాలకు ఆటంకంగా మారవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ట్రంప్ విధిస్తున్న గ్లోబల్ టారిఫ్‌ల చట్టబద్ధతపై అక్కడి అత్యున్నత న్యాయస్థానంలో కేసు కొనసాగుతోంది. ఈ కేసులో బుధవారం తీర్పు వెలువడనుంది. ఒకవేళ ట్రంప్‌నకు వ్యతిరేకంగా తీర్పు వస్తే.. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై తక్షణమే టారిఫ్‌లు విధించే అధికారాలు పరిమితమయ్యే అవకాశం ఉంది.
