Rangareddy | జిల్లా అస్తిత్వాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తున్నదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకు చరిత్రాత్మక పేరు ఉన్నదని.. దానిని చెరిపేయాలన్న కుట్ర జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డిని మూడు జిల్లాలుగా విభజించారని.. కొత్తగా అర్బన్, రూరల్ జిల్లాలుగా విభజించాలని యత్నించడం సమంజసం కాదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
– రంగారెడ్డి, జనవరి 13 (నమస్తే తెలంగాణ)
ఇబ్రహీంపట్నంను ఒకే కమిషనరేట్ పరిధిలోకి తేవాలి
ఇబ్రహీంపట్నం సెగ్మెంట్‌లోని ఠాణాలన్నింటినీ ఒకే కమిషనరేట్ పరిధిలోకి తేవాలి. అబ్దుల్లాపూర్‌మెట్, ఫార్మాసిటీ, ఆదిబట్ల ఠాణాలను పక్కనే ఉన్న ఫ్యూచర్‌సిటీ పరిధిలోకి తీసుకురాలేదు. అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణాను వనస్థలిపురం ఏసీపీ పరిధికి, ఫార్మాసిటీ ఠాణాను మహేశ్వరం ఏసీపీ పరిధికి, ఆదిబట్ల ఠాణాకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధికి తీసుకెళ్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న తప్పులతో పాటు మున్సిపాలిటీల విభజన, జిల్లాల విభజనపై త్వరలోనే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. ప్రభుత్వం వెంటనే పునరాలోచించి సరిచేయాలి.
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
జిల్లా పరిధిలోని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో కలుపగా.. ఆ ప్రక్రియ శాస్త్రీయం గా జరగలేదని అధికారులు ఇష్టానుసారంగా చేశారని ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. తుర్కయాంజాల్‌ను సర్కిల్ కార్యాలయంగా చేయకుండా ఆదిబట్లను చేయడంతో స్థానికుల నుంచి తీవ్ర నిరసన రావ డంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం వెంటనే తుర్కయాంజాల్‌ను సర్కిల్ కార్యాలయంగా మార్చింది. అలాగే, బడంగ్‌పేటను జోనల్ కార్యాలయంగా మా ర్చాలని ఆందోళన మొదలైంది. మీర్‌పేట, బడంగ్‌పేట, ఆదిబట్ల, కొంగర, తొర్రూరు, తుక్కుగూడ వంటి వార్డులను కలుపుతూ.. బడంగ్‌పేట జోనల్ కార్యాలయంగా ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి. వాటిని శంషాబాద్ జోన్‌లో కలపడాన్ని బడంగ్‌పేటవాసులు జీర్ణించుకోలేకపోతున్నారు.
పోలీస్ కమిషనరేట్ పరిధి కూడా అస్తవ్యస్తం..
ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ పరిధి కూడా అస్తవ్యస్తంగా ఉన్నదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ పరిధిలో ఉన్న ఆదిబ ట్ల ఠాణాను ఫ్యూచర్‌సిటీ పరిధిలో కాకుండా హైదరాబాద్ పోలీస్ కమిషన రేట్‌కు మార్చడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రంగారెడ్డి కలెక్టరేట్ లో ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ ఉండగా పక్కనే ఉన్న ఆదిబట్ల ఠాణాను హైదరాబాద్‌లో కలపడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే, ఇబ్రహీంపట్నానికి సమీపంలో ఉన్న ఫార్మాసిటీ ఠాణాను మేడిపల్లి లేదా కుర్మిద్దలో ఏర్పాటు చేసి ఇబ్రహీంపట్నం ఏసీపీ పరిధిలోకి తీసుకురావాలి, కానీ, దానిని మహేశ్వరం ఏసీపీ పరిధిలోకి మార్చడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా ఉన్నది. అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణాను వనస్థలిపురం ఏసీపీ పరిధిలో చేర్చారు. అది ఇబ్రహీంపట్నం సెగ్మెంట్‌లో ఉండడంతో ఇబ్రహీంపట్నం ఏసీపీ పరిధిలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. పోలీసు కమిషనరేట్ పరిధిని అస్తవ్యస్తంగా కుదించారని మండిపడుతున్నారు.
