Pongal Movies |సంక్రాంతి 2026 రేసులో థియేటర్లలో సందడి చేసిన పెద్ద సినిమాలు ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తున్నాయి. పండుగ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ చిత్రాలు, త్వరలోనే ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌లలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. ఆసక్తికరంగా, విడుదల కాబోతున్న ఐదు ప్రధాన చిత్రాల్లో రెండు ఒకే డిజిటల్ వేదికపై స్ట్రీమింగ్ కానుండటం సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన హారర్–కామెడీ ఫాంటసీ థ్రిల్లర్ ‘ది రాజా సాబ్’ థియేటర్ల తర్వాత వెంటనే OTT ప్రయాణాన్ని ప్రారంభించబోతోంది. ఫిబ్రవరి తొలి వారంలోనే జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన కుటుంబ వినోద చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’, అలాగే కామెడీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రెండూ జీ5 వేదికగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో చిరంజీవి సినిమా వాలెంటైన్స్ డే చుట్టూ, మరో చిత్రం ఫిబ్రవరి రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని టాక్. యువ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా నెట్‌ఫ్లిక్స్ చేతికి వెళ్లింది. ఈ చిత్రం ఫిబ్రవరి మూడో వారంలో డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు, సంక్రాంతి ఎంటర్‌టైనర్‌గా మంచి స్పందన దక్కించుకున్న ‘నారీ నారీ నడుమ మురారి’ థియేటర్లలో నాలుగు వారాల ప్రదర్శన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
మొత్తంగా చూస్తే, ఈ సంక్రాంతి సినిమాలన్నీ దాదాపు 28 రోజుల OTT విండోను పాటిస్తూ, థియేటర్ల తర్వాత ఇంటి వద్దే పూర్తి స్థాయి వినోదాన్ని అందించడానికి రెడీ అవుతున్నాయి. థియేటర్ మిస్ అయినవారికి ఇది పండుగలా మారనుంది. మరి ఈ చిత్రాల ఓటీటీ రిలీజ్ డేట్స్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.
