సస్పెన్స్‌కు తెరదించిన కమిషనర్ కర్ణన్
ఫిబ్రవరి 11న అధికారిక ప్రకటన
సిటీబ్యూరో: ప్రస్తుత జీహెచ్ఎంసీ 300 వార్డులతో ఒక కార్పొరేషన్‌గా ఎన్నికలకు వెళుతుందా? లేదంటే మూడు ముక్కలుగా కార్పొరేషన్ల విభజన చేసి ఎన్నికలకు వెళ్తారా? అన్న చర్చ జరుగుతున్న తరుణంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శనివారం ఈ సస్పెన్స్‌కు తెరదించారు. మీడియా చిట్ చాట్‌లో మాట్లాడిన కమిషనర్ ఆర్వీ కర్ణన్ మూడు విభాగాలుగా మారుస్తున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 10వ తేదీతో ప్రస్తుత పాలక మండలి గడువు ముగియనుండగా, మరుసటి రోజే (ఫిబ్రవరి 11)న మూడు కార్పొరేషన్ల ప్రక్రియ పట్టాలెకనుంది. అయితే మూడు కార్పొరేషన్లలో భాగంగా శంషాబాద్ వరకు విస్తరించిన ప్రధాన నగరం 150 డివిజన్లతో జీహెచ్ఎంసీ కొనసాగనున్నది. ఐటీ ప్రాంతాలను కలుపుతూ గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా, తూర్పు హైదరాబాద్ డివిజన్లతో గ్రేటర్ మల్కాజ్‌గిరిగా మరో కార్పొరేషన్ ఏర్పాటు కానున్నది.
కాగా తార్నాకలోని హెచ్ఎండీఏ కార్యాలయం ఇప్పటికే మలాజిగిరి కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంగా రూపుదిద్దుకుంటుండగా, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాదాపూర్ న్యాక్‌తో పాటు మణికొండలో ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుత జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే జీహెచ్ఎంసీ కొనసాగనున్నది. మూడు కార్పొరేషన్లు ఏర్పాటు తర్వాత కూడా విభజన జరిగినప్పటికీ, 150 డివిజన్లతో కూడిన పాత జీహెచ్ ఎంసీ కొత్తగా ఏర్పడిన రెండు కార్పొరేషన్లపై ‘పెద్దన్న’ పాత్ర పోషించనుంది. దీనికోసం ప్రస్తుతం ఉన్న కమిషనర్ హోదాను ‘చీఫ్ కమిషనర్’గా మార్చనున్నట్లు తెలుస్తున్నది. కాగా, పురపాలక శాఖ శనివారం రాష్ట్రవ్యాప్త రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఇందులో భాగంగా జీహెచ్ ఎంసీ మేయర్ పీఠాన్ని ‘మహిళా జనరల్’ క్యాటగిరీకి కేటాయించారు. అయితే 300 డివిజన్ల రిజర్వేషన్లు ఇప్పట్లో ప్రకటించే అవకాశం లేదని కమిషనర్ కర్ణన్ స్పష్టం చేశారు. విభజన పూర్తయి, ఆయా కార్పొరేషన్ల పరిధిలోని వార్డుల వారీగా జిల్లా ఎన్నికల అధికారులు సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు చెప్పారు.
