శ్రీ సత్యసాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత నిప్పులు చెరిగారు మాజీ సీఎం జగన్ రెడ్డిపై. ఆయనకు నిలువెల్లా విషం తప్ప ఏమీ లేదన్నారు. అభివృద్ది అంటే పడదన్నారు. ఎంత సేపు చిల్లర రాజకీయాలు చేయడం మాత్రమే వచ్చు అని అన్నారు. సమర్థవంతమై నాయకుడైన చంద్రబాబు ను చూస్తే తను తట్టుకోలేడంటూ మండిపడ్డారు. అప్పులు, పశు, జింక మాంసాల పేరుతో సొంత కార్యకర్తలనే కేసుల పెట్టి, వేధించిన చరిత్ర మీదని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై విషం కక్కడం మానుకోవాలని హితవు పలికారు సవిత. కూటమి ప్రభుత్వానికి సహకరించాలని జగన్ కు, ఆయన పార్టీ నాయకులకు హితవు పలికారు. పరిగి మండలం పాత్రగానీపల్లి గ్రామం నుంచి బీచిగానిపల్లి గ్రామం వరకు రూ.80 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఆమె శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా బీచిగానిపల్లిలో నిర్వహించిన సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలోనూ, నియోజక వర్గంలోనూ అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీచిగానిపల్లిలో ఉపాధి హామీ పథకం కింద రూ.4 కోట్లతో 56 పనులు చేశామన్నారు. రూ.76 లక్షలతో సీసీ రోడ్లు, కాలువలు నిర్మించామన్నారు. తాగునీటి కల్పనకు మూడు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించామన్నారు. రూ.2 కోట్లు వెచ్చించి బీసీ హాస్టల్ ను నిర్మిస్తున్నామని చెప్పారు సవిత. ఇప్పటికే బీసీ, ఎస్సీ హాస్టళ్ల మరమ్మతులు చేపట్టామన్నారు. సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు చేశామని, సంక్షేమంతో పాటు సంపద సృష్టిస్తున్నామని, ఉపాధి కల్పిస్తున్నామని వెల్లడించారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
The post జగన్ రెడ్డికి అభివృద్ది అంటే పడదు : ఎస్. సవిత appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
