Trump | టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నమ్మక ద్రోహి అని ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరు నిరసనలను ప్రారంభించేటపుడు ట్రంప్‌ను తమ జీవన రేఖగా భావించారు. తాజాగా ట్రంప్ చేపడుతున్న చర్యలకు, అంతకుముందు ఆయన చెప్పిన మాటలకు చాలా వ్యత్యాసం ఉందని వీరు మండిపడుతున్నారు. నిరసనలు ప్రారంభమైన తొలినాళ్లలో ఇరానియన్ నిరసనకారులను ట్రంప్ బహిరంగంగా ప్రోత్సహించారు. ఇరాన్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. “సాయం మార్గమధ్యంలో ఉంది” అని సామాజిక మాధ్యమాల ద్వారా భరోసా ఇచ్చారు. శాంతియుత నిరసనలకు విఘాతం కలిగిస్తే, అమెరికా చర్యలకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఈ హెచ్చరికలను నమ్మిన నిరసనకారులు తమకు ట్రంప్ గట్టిగా మద్దతిస్తారని, సైనిక జోక్యం చేసుకుంటారని విశ్వసించి, వీధుల్లోకి వచ్చారు. దీంతో ఇరాన్ ప్రభుత్వం వారిపై విరుచుకుపడింది. ప్రాణాంతక హింసకు పాల్పడింది.
పెద్ద సంఖ్యలో నిరసనకారులు మరణించినట్లు, చాలా మంది ఆచూకీ గల్లంతు అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రాంతంలోని ప్రధాన అమెరికన్ స్థావరం నుంచి నాన్-ఎసెన్షియల్ సిబ్బందిని వేరొక చోటుకు తరలించాలని పెంటగాన్ ఆదేశించిందనే వార్తను విన్న నిరసనకారులు యుద్ధానికి అమెరికా సిద్ధమవుతున్నదని భావించారు. ట్రంప్ ప్రకటనలు నిరసనకారుల్లో ఆశలు రేకెత్తించాయి, ట్రంప్ సాయం తప్పనిసరిగా అవసరమైన సమయంలో వీరి ఆశలు ఆవిరైపోయాయి. తెర వెనుక ఒప్పందం కుదిరిందని కొందరు భావిస్తున్నారు. టెహ్రాన్‌లో ఓ మహిళ మాట్లాడుతూ, ‘నా ఆశలన్నీ అడియాశలయ్యాయి. ట్రంప్ ఏమీ చేయబోవడం లేదు. ఎందుకు చేస్తాడు? మా గురించి ఆయన పట్టించుకోడు” అని ఆవేదన వ్యక్తం చేసింది. ట్రంప్ మాటలను ఇరాన్ నేతలు బహిరంగంగా ఎగతాళి చేయడంతోపాటు మరింత గట్టిగా అణచివేస్తామని చెప్పడంతో నిరసనకారుల ఆగ్రహం మరింత పెరిగింది. బాహ్య శక్తి ఇచ్చిన మాటను నమ్మినందుకు తాము మూల్యం చెల్లించామని చాలా మంది వాపోతున్నారు.
ఖమేనీ పాలనకు అంతం పలకాలి: ట్రంప్
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ 37 ఏండ్ల దుష్ట పాలనను అంతం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. అల్లర్లతో ఇరాన్ దేశం అట్టుడుకుతున్న క్రమంలో శనివారం ఆయన ‘పొలిటికో’ పత్రికతో మాట్లాడుతూ ‘ఇరాన్‌లో ఇప్పుడు కొత్త నాయకత్వం కోసం చూడాల్సిన సమయమిది’ అని అన్నారు. రెండు రోజుల క్రితం 800 మంది కంటే ఎక్కువ మంది పౌరులను ఉరి తీయకుండా ఆపడం ఆయన తీసుకున్న అత్యుత్తమ నిర్ణయమని ఆయన అన్నారు. అణచివేత, హింసపైనే ఆధారపడి ఖమేనీ పాలన కొనసాగుతున్నదని ఆయన ఆరోపించారు. దేశంలోని అస్థిరతకు ఆయనే కారణమని ట్రంప్ ఆరోపించారు.
ఇరాన్ ఆందోళనల్లో 5 వేల మంది మృతి
ఇరాన్‌లో జరుగుతున్న నిరసనల్లో కనీసం 5 వేల మంది మరణించారని, ఇందులో 500 మంది భద్రతా సిబ్బంది ఉన్నారని ఇరాన్ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. ఉగ్రవాదులు, సాయుధ తిరుగుబాటుదారులు అమాయక ఇరానియన్లను చంపారని ఆయన తెలిపారు.
