ఖమ్మం జిల్లా : జపాన్, జర్మనీ దేశాలలో నర్సింగ్ కు ఫుల్ డిమాండ్ ఉందన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. అందుకు అనుగుణంగా ఆయా దేశాలకు సంంధించిన భాషలను నర్సింగ్ కోర్సు చేస్తున్న విద్యార్థినులకు నేర్పిస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో దాదాపు 362 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. మున్నేరు నుంచి పాలేరు లింక్ కెనాల్, ఏదులాపురంలోని జేఎన్‌టీయూ కళాశాలకు శంకుస్థాపన చేశారు. కూసుమంచిలో వంద పడకల ఆసుపత్రి, మద్దులపల్లిలో నూతన మార్కెట్ యార్డు, నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఏదులాపురం నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని నర్సింగ్ విద్యార్థులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
వివిధ దేశాల్లో ఉన్న ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి నర్సింగ్ విద్యార్థులకు జపనీస్, జర్మన్ భాషలు నేర్చుకునేలా ప్రభుత్వం అవసరమైన కార్యాచరణను రూపొందిస్తుందని స్పష్టం చేశారు. జపాన్, జర్మనీ వంటి దేశాల్లో ఇంజనీరింగ్ కంటే నర్సింగ్ విద్యార్థులకు అత్యధిక డిమాండ్ ఉందన్నారు. భాష ఒక్కటే అడ్డంకిగా మారిన నేపథ్యంలో ఇక్కడి విద్యార్థులకు జపనీస్, జర్మన్ భాషలను బోధించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం అని తెలిపారు. త్వరలోనే నర్సింగ్ కాలేజీలకు ఆ భాషలను బోధించే ఉపాధ్యాయులను పంపిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి.
ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. పేద ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం అన్నారు. సమాజంలో వైద్య వృత్తికి, వైద్యులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందన్నారు సీఎం. అలాంటి వృత్తిలో ఉన్నవారు వ్యక్తిగతంగా కష్టనష్టాలు ఎదురైనప్పటికీ నిరుపేదలకు సేవలందించడంలో నిర్లక్ష్యం వహించ వద్దని కోరారు. నిరుపేదలకు సేవలందించడం ఒక బాధ్యతగా భావిస్తూ నర్సింగ్ వృత్తిలో రాణించి దేశ ప్రతిష్టను మరింత పెంచాలని కోరారు. నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు.
The post జపాన్, జర్మనీ దేశాలలో నర్సింగ్ కు ఫుల్ డిమాండ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
