విజయవాడ : జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీల వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఓ ప్రభుత్వ ఉద్యోగిని పట్ల ఆయన అనుసరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో బాధితురాలు ధైర్యంగా బయటకు వచ్చి తనపట్ల ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరుపై బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు సాక్ష్యాధారాలను బయట పెట్టింది. అంతే కాకుండా తనకు రక్షణ కల్పించాలని, సమగ్ర విచారణ జరిపించాలని, తనకు న్యాయం చేయాలని కోరింది. ఈమేరకు స్వయంగా సీఎం నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాసింది. న్యూడ్ కాల్ చేయడం, తనను బలవంతపు పెట్టడం, శారీరకంగా, మానసికంగా వేధింపులకు పాల్పడడం పట్ల ఆవేదన చెందింది బాధితురాలు.
దీంతో జనసేన పార్టీ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు రంగంలోకి దిగింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే పై చర్యలు తీసుకుంది. ఇదిలా ఉండగా ఈ మొత్తం వ్యవహారంపై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు ఈ సందర్బంగా వెల్లడించారు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చి తగిన చర్యలు తీసుకుంటామని బాధితురాలికి భరోసా ఇచ్చాం అన్నారు. మహిళల గౌరవం, భద్రతకు భంగం కలిగించే చర్యలను మహిళా కమిషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని హెచ్చరించారు. సమగ్ర విచారణకు ఆదేశించామన్నారు.
The post జనసేన ఎమ్మెల్యే వ్యవహారంపై సమగ్ర విచారణ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
