కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటుడిగా మాత్రమే కాదు దర్శకుడిగా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. హిట్టు ప్లాప్స్ కు సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ కోలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ లోను వరుస హిట్స్ కొడుతున్నాడు ధనుష్. ప్రస్తుతం ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్నాడు ధనుష్. ఇదిలా ఉండగా ధనుష్ మరో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. న్యూ టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో ముందుండే ధనుష్ గతేడాది తన మేనల్లుడు హీరోగా స్వీయ దర్శకత్వంలో ‘ జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాతో వెండితెరకు పరిచయం చేసాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది కూడా.
ఈసారి తన ఇద్దరుకుమారులలో ఒకరైన యాత్ర రాజాను హీరోగా సినీ రంగానికి పరిచయం చేయబోతున్నాడు ధనుష్. ఈ చిత్రానికి ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించనుండటం విశేషం. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేసుకున్న ధనుష్, ఈ కొత్త కథ ద్వారా మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. యాత్ర రాజా కోసం ప్రత్యేకంగా ఈ కథను రూపొందించినట్టు సమాచారం. ఈ సినిమాను ధనుష్ సొంత నిర్మాణ సంస్థ అయిన వుండర్‌బార్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. గతంలో ఈ బ్యానర్ నుంచి వచ్చిన చిత్రాలు కంటెంట్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. తండ్రి దర్శకత్వంలో నమ్మకమైన నిర్మాణ సంస్థ తోలి సినిమా చేయబోతున్న యాత్ర రాజాకు ఈ సినిమా మంచి ఆరంభం కావచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
