ములుగు జిల్లా : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా వెలుగొందుతున్న శ్రీ సమ్మక్క సారమ్మ మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. ఆ ప్రాంగణమంతా సముద్రాన్నితలపింప చేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండగా గురువారం కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి , కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరమ్ దర్శించుకున్నారు. ఈసందర్బంగా ప్రభుత్వం తరపున సహచర మంత్రులు దనసరి అనసూయ (సీతక్క) , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఘన స్వాగతం పలికారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా వన దేవతలైన అమ్మ వార్లను దర్శించుకుని, నిలువెత్తు బంగారం సమర్పించి తమ మొక్కులు చెల్లించారు కేంద్ర, రాష్ట్ర మంత్రులు.
ఈ సందర్భంగా కుంభ మేళాను తలపించే విధంగా సమ్మక్క సారలమ్మ జాతరను నిర్వహిస్తున్నామని, ఇక్కడికి వచ్చే భక్తుల కోసం శాశ్వతమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని, అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని గుర్తు చేశారు. ప్రధానితో చర్చించి జాతీయ పండుగగా గుర్తింపు అందించాలని విన్నవించారు రాష్ట్ర మంత్రి. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు మేడారం జాతర అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి , కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరమ్ స్పష్టం చేశారు.
మేడారం మహా జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ గిరిజనుల సైతం మేడారం మహా జాతర గురించి తెలుసుకోవాలని, రాబోయే రోజుల్లో ఇక్కడి అమ్మవార్లను దర్శించుకోవాలని వారు పేర్కొన్నారు. జాతరలో ఏర్పాట్లు బాగున్నాయని వారు కొనియాడారు.
The post వన దేవతలను దర్శించుకున్న మంత్రులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
