Medaram Jathara: తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర నేటితో ముగియనుంది. అయితే, సమ్మక్క- సారలమ్మ గద్దెలపైకి చేరడంతో మేడారం మహా జాతర మొత్తం జనసంద్రమైంది. జంపన్న వాగులో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత గద్దెల వద్ద అమ్మవార్లకు బంగారం (బెల్లం)తో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక, శుక్రవారం ఒక్కరోజే సుమారు 50 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. ఇద్దరు తల్లులతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరడంతో భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. వనం మొత్తం ఇసుక వేసినా రాలనంత ప్రజలు ఉన్నారు. దీంతో తాడ్వాయి- మేడారం రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే మార్గంలో దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. మూడు రోజులుగా జాతరలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు నిన్నటి నుంచే తిరుగు ప్రయాణం అవుతున్నారు.
Read Also: APPSC: గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల
మేడారంలో గందరగోళం
అయితే, శుక్రవారం నాడు సక్కమ- సారలమ్మలను దర్శించుకున్న భక్తులు తిరుగు పయనం అవుతున్న సమయంలో ఆర్టీసీ బస్సులు లేక నిన్న సాయంత్రం నుంచి బస్టాండ్ లలో వేచి ఉన్నారు. సరిపడిన బస్సులు లేకపోవడంతో భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అప్రమత్తమైన ఆర్టీసీ అధికారులు అదనంగా మరిన్నీ బస్సులను మేడారం జాతరకు పంపుతున్నారు. అలాగే, గురువారం రాత్రి దాదాపు 10 గంటల సమయంలో సమ్మక్క తల్లి గద్దె పైకి వచ్చింది. ఈ అపూర్వ ఘట్టాన్ని చూసేందుకు మూడు నుంచి నాలుగు రోజులుగా వేచి చూసిన భక్తులు ఒక్కసారిగా గద్దెల ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో టీటీడీ భవనం పక్కనున్న సాధారణ, వీఐపీ, వీవీఐపీ క్యూలైన్ల నుంచి జంపన్న వాగు, ఆర్టీసీ జంక్షన్ వైపు స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఇదే సమయంలో రెండు సార్లు విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో పిల్లలు, వృద్ధులతో వచ్చిన భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అలాగే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్ వచ్చి భక్తుల మధ్య చిక్కుకుని ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. రద్దీ నుంచి వెళ్తున్న వీఐపీ వాహనాలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Ajit Pawar Wife Oath Ceremony: నేడే మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ ప్రమాణస్వీకారం.. శాఖలు ఇవే..?
నేటితో ముగియనున్న మహాజాతర
మేడారం మహా జాతర ఈ నెల 28వ తేదీన ప్రారంభమై ఈరోజు ( జనవరి 31)తో ముగియనుంది. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలపైకి చేరుకున్నారు. ఇక, 29న చిలుకలగుట్ట నుంచి సమ్మక్కతల్లిని ప్రధాన గద్దెపై ప్రతిష్ఠించారు. శుక్రవారం నలుగురు దేవతలు భక్తులకు దర్శనమివ్వగా.. తల్లులు గద్దెలపై కొలువుదీరడంతో భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఇవాళ నలుగురు తిరిగి వనంలోకి ప్రవేశించడంతో మహా జాతర ముగుస్తుంది.
