విజయవాడ : దేశ వ్యాప్తంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా రామకృష్ణ మిషన్ ఎనలేని కృషి చేస్తూ వస్తోంది. ఇందులో మరో బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ గాంధీనగర్ లోని శైలజా థియేటర్ ఎదురుగా.. నూతనంగా నిర్మించిన వివేకానంద మానవ వికాస కేంద్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రామకృష్ణ మిషన్ బేలూర్ మఠం వారి అనుబంధ శాఖగా విజయవాడలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగగా విజయవాడ రామకృష్ణ మిషన్ రజతోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఈ శుభ సందర్భంలో మాఘపౌర్ణమితో పాటు స్వామి అద్భుతానంద మహరాజ్ జయంతి కావడంతో ఆ పవిత్రమైన రోజున శ్రీమత్ స్వామి గౌతమానందజీ మహరాజ్ చేతుల మీదుగా వివేకానంద హ్యుమన్ ఎక్సలెన్స్ సెంటర్ ప్రారంభిస్తున్నట్లు విజయవాడ రామకృష్ణ మిషన్ వెల్లడించింది. ఈ విశిష్ఠ కార్యక్రమానికి భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హాజరవుతున్నట్లు తెలిపింది.
ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 9గం.లకు నూతన భవన ప్రారంభోత్సవం జరగనుందని విజయవాడ రామకృష్ణ మిషన్ సహాయ కార్యదర్శి శితికంఠ స్వామీజి వెల్లడించారు. భారత ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో మానసిక ఆరోగ్యం, ‘డిజిటల్’ వ్యసనాలపై సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించుకున్న 2047 వికసిత భారత్ లక్ష్యాల సాకారంలో కీలకమైన ఉపాధి అవకాశాల పెంపులో రామకృష్ణమిషన్ సైతం తన వంతు భాగస్వామ్యం అవుతుందని శితికంఠ స్వామీజీ స్పష్టం చేశారు. దేశంలో ఎన్నో శిక్షణా కేంద్రాలున్నప్పటికీ సివిల్ సర్వీసులలో కీలకమైన విలువలు, నైతికత వంటి అంశాలలో ఈ ట్రైనింగ్ కేంద్రం ప్రత్యేక శిక్షణ ఇస్తుందన్నారు. ఆసక్తి కలిగిన యువతీ యువకులు ధ్యానం, యోగా, వ్యక్తిత్వ వికాసం, మనోనిగ్రహం, భావ ప్రకటన నైపుణ్యాల పైనా శిక్షణ, ఆధ్యాత్మిక ప్రవచనాలు, అంతర్యోగం అలవరచు కోవచ్చన్నారు. బాల సంస్కార కేంద్రం ద్వారా ఆసక్తి కలిగిన వారికి గాత్రం, వాయిద్యాలు, యోగ, నృత్యం, విలువలు, నైతిక బోధ, భక్తిగీతాలను నేర్పనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లో 20 ఏళ్ల క్రితం ఏర్పాటైన హ్యుమన్ ఎక్సలెన్స్ సెంటర్ ద్వారా 18 లక్షల మందికి పైగా శిక్షణ పొందినట్లు స్వామిజీ తెలిపారు.
The post వివేకానంద మానవ వికాస కేంద్రం ప్రారంభానికి సిద్దం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
