అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వెంటనే ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కల్టివేషన్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఇలా అన్ని అంశాలు అంతర్జాతీయ స్థాయిలో కోకో సిటీలో ఉండాలని స్పష్టం చేశారు సీఎం. మామిడి, కోకో, జీడిమామిడి, కొబ్బరి తోటల్లో అంతర్ పంటల సాగుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రైతుల్ని ఆ దిశగా ప్రోత్సహించాలని సూచించారు. అరటి ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నప్పటికీ… ఎగుమతుల విషయంలో వెనకబడ్డామని అన్నారు. ఎగుమతులపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే, స్థానిక గిరిజనుల భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో లంబసింగిలో పెద్దఎత్తున కుంకుమపువ్వు సాగుకు ముందుకొచ్చే సంస్థలకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు.
ఇందుకు సంబంధించి ఆక్వా సాగు వివరాలను రైతులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. పౌల్ట్రీ రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్ట్‌ను రైతులకే ఇవ్వాలని సీఎం నిర్దేశించారు. వ్యవసాయం, అనుబంధం రంగాలకు సంబంధించి కేంద్ర పాలసీలకు అనుగుణంగా రాష్ట్ర పాలసీలు ఉండాలని చెప్పారు. కుప్పంలో ఫ్లవర్ ఫెస్టివల్ నిర్వహించినట్టే మన పంటలకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో పలు ఫెస్టివల్స్ నిర్వహణకు ఆలోచన చేయాలని అన్నారు సీఎం. దీంతో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ విస్తృతం అవుతుందన్నారు.
అవసరమైతే కేంద్రంతో మాట్లాడి మన వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ప్రత్యేక రైల్ బోగీలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. హార్టీకల్చర్, ఆక్వాకు ఏపీ గమ్యస్థానంగా ఉందని అన్నారు. ఈ పంట, శాటిలైట్ సమాచారం ద్వారా దిగుబడి అంచనా వేసి, అందుకు అనుగుణంగా మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలన్నారు. ఫ్రూట్ కవర్లతో మామిడికి మంచి నాణ్యత-ధర వచ్చిందని, జామ, దానిమ్మ వంటి పండ్ల తోటలకు ఈ విధానాన్ని అనుసరించేలా చూడాలని సీఎం చెప్పారు. ఫుడ్ క్లస్టర్ల వారీగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకున్న సంస్థలు త్వరితగతిన నెలకొల్పేలా సంప్రదింపులు జరపాలన్నారు. త్వరలో మామిడి ప్రాసెసింగ్ యజమానులతో సమావేశం నిర్వహించి, వారి సమస్యలు పరిష్కరిద్దామని సీఎం చెప్పారు.
The post ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
