హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో(Muncipal elections) భాగంగా నేడు కామారెడ్డి జిల్లాలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పర్యటించనున్నారు. బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం జిల్లాకు చేరుకోనున్న కేటీఆర్ ర్యాలీలు, కార్నర్ మీటింగ్‌లలో పాల్గొననున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిన తీరును ఆయన ఎండగట్టనున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని, కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అవినీతిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించనున్నారు.
కాగా, కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశారు. బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణాల్లో ర్యాలీలు, కార్నర్ మీటింగ్‌లు జరిగే ప్రాంతాలను గులాబీ జెండాలతో ముస్తాబు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ షిండే దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం బాన్సువాడకు చేరుకోనున్న రామన్న.. కొయ్యగుట్ట అమరవీరుల స్థూపం నుంచి పట్టణంలోని ప్రధాన రహదారి వెంట రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో సుమారు పదివేల మందితో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.
