హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నిప్పులు చెరిగారు. నిప్పుతో ఊహించని ముప్పు ఉంటుందని, 30 సెకెండ్ల సమయంలో మంటలు వ్యాపించే పరిస్థితి ఉందన్నారు. వచ్చేది వేసవి కాలం.. జాగ్రత్తలు తీసుకుంటే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పారు. అగ్ని మాపక నిబంధనలన్నీ తూచా తప్పకుండా అందరూ పాటించాలని స్పష్టం చేశారు. నగరంలో జరిగిన అనేక అగ్ని ప్రమాదాలను పరిశీలిస్తే నిబంధనలు పాటించక పోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోందని చెప్పారు. అందుకే హైడ్రా అగ్ని ప్రమాదాలపై దృష్టి పెట్టిందన్నారు. ఈ క్రమంలోనే అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తూ వస్తోందని చెప్పారు కమిషనర్. అగ్ని ప్రమాదాలపై పాతబస్తీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జూల్ఫికర్ కూడా పాల్గొన్నారు.
తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో జనవరి నెలాఖరులో తనిఖీలు చేపట్టి 9 షాపులను సీజ్ చేసినట్టు గుర్తు చేశారు. పలు వ్యాపార సంఘాల వినతుల మేరకు ఒక నెల రోజులు సమయం ఇచ్చామని.. మార్చి నెల రెండో వారం నుంచి తనిఖీలు ముమ్మరం చేస్తామన్నారు. నిబంధనలు పాటించకపోతే ఆయా వ్యాపార సముదాయాలను, షాపులను సీజ్ చేస్తామని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. అగ్ని ప్రమాదాల నేపథ్యంలో హైడ్రా తనిఖీలు చేయడం, నిబంధనలు పాటించని వ్యాపార సుముదాయాలను సీజ్ చేయడాన్ని వేధించడంగా భావించవద్దని చెప్పారు. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే తమకు సమాచారం ఇవ్వాలని వ్యాపార సంఘాల ప్రతినిధులతో పాటు.. పౌరులను హైడ్రా కమిషనర్ కోరారు. ప్రజల భద్రతకు హైడ్రా పెద్ద పీట వేస్తుందన్నారు.
The post నిబంధనలు పాటించక పోతే సీజ్ చేస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
