Bollywood | బాలీవుడ్ సినీరంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటి ప్రవీణ దేశ్ పాండే మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత ఐదేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఆరోగ్యం ఇటీవల మరింత విషమించడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ వార్తతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.
రంగస్థల నటనతో తన కెరీర్‌ను ప్రారంభించిన ప్రవీణ దేశ్ పాండే, నాటకాల్లో శిక్షణ పొందుతూ తన నటనా ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. అక్కడి నుంచి టెలివిజన్ సీరియల్స్, తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. హిందీతో పాటు మరాఠీ భాషల్లోనూ ఆమె అనేక పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ముఖ్యంగా రెడీ చిత్రంలో నటుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి కీలక పాత్ర పోషించడం ద్వారా ఆమెకు విస్తృత గుర్తింపు లభించింది. అలాగే గబ్బర్ ఈజ్ బ్యాక్ సినిమాలోనూ ఆమె నటన ప్రశంసలు అందుకుంది.
2019లో ప్రవీణ దేశ్ పాండే మల్టిపుల్ మైలోమా అనే రక్త క్యాన్సర్ వ్యాధికి గురయ్యారు. అయినప్పటికీ చికిత్స తీసుకుంటూనే తన నటనా ప్రయాణాన్ని కొనసాగించారు. మధ్యలో ఆరోగ్య కారణాలతో కొంత విరామం తీసుకున్న ఆమె 2023లో మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ఇటీవల దర్శకుడు నీరజ్ పాండే రూపొందించిన వెబ్ సిరీస్ ‘తస్కారి’లో చిన్న పాత్రలో కనిపించారు. ఆ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో “మళ్లీ నటించాలని ఉంది, జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను” అని చెప్పిన ఆమె మాటలు ఇప్పుడు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఆమె మరణంపై CINTAA (సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ప్రవీణ దేశ్ పాండే మరణం బాలీవుడ్‌కు తీరని లోటుగా మిగిలింది.
