NIMS | ఖైరతాబాద్, ఫిబ్రవరి 20: నిమ్స్‌లో కార్పొరేట్ స్థాయిలో పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.దవాఖానకు నిత్యం 4వేల మందికి పైగా రోగులు, వారి సహాయకులతో కలిసి వస్తుంటారు. అప్పటికే వ్యయ ప్రయాసాల కోర్చి వచ్చిన రోగులకు పార్కింగ్ ఫీజులు భారంగా మారుతున్నాయి. పార్కింగ్ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ వారి జేబులకు చిల్లులు పెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నిమ్స్‌లో పార్కింగ్ హక్కులను దక్కించుకున్న గుత్తేదారు ఇష్టారాజ్యంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాడంటూ సికింద్రాబాద్ గాంధీనగర్‌కు చెందిన తిమ్మన నవీన్ రాజు ఇటీవల హైకోర్టులో పిటిషన్ (డబ్ల్యూ.పి.నం. 5296 ఆఫ్ 2026) దాఖలు చేశాడు. దీనిపై కోర్టులో విచారణ జరిగింది. రెండు వారాల్లో దీనిపై విచారణ చేసి వివరణ ఇవ్వాలని, అంతవరకు ఆస్పత్రిలో ఎలాంటి పార్కింగ్ ఫీజులు వసూలు చేయవద్దంటూ హైకోర్టు.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఈవీడీఎం డైరెక్టరేట్, నిమ్స్ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.
నిమ్స్ దవాఖానలో ఇష్టారాజ్యంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేయడంపై గతంలోనే ఆరోపణలు వచ్చాయి. ద్విచక్రవాహనానికి గంటకు 20, కార్లు, ఇతర భారీ వాహనాలకు రూ.80 వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్‌లు ఏర్పాటు చేసుకొని అక్రమంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు సైతం వినిపించాయి. తాజాగా నవీన్ రాజు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఈ అంశంపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పార్కింగ్ విషయంలో కోర్టు ఆదేశాలపై రోగులు, వారి సహాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
2018 ఫిబ్రవరి 20న జారీ చేసిన జీవో నం. 63 ప్రకారం ఆస్పత్రుల్లో పార్కింగ్ వసూలు చేయడం నిషిద్దం. వీటిని ఉల్లంఘంచిన కొన్ని ప్రైవేట్ దవాఖానలతో పాటు నిమ్స్‌కు గతంలో జరిమానాలు విధించినట్లు సమాచారం. ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో అక్రమంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేయడమంటే జీవో నం.63ని అతిక్రమించినట్లేనని నవీన్ రాజు హైకోర్టులో సమర్పించిన పిటీషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదల ఆస్పత్రి అని చెప్పుకొనే నిమ్స్ దవాఖానలో పూర్తి ఉచితంగా పార్కింగ్ ఏర్పాటు చేయాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు.
