Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

ఈ లోకం.. వింతలా మారనుందా?!

Ai generated article, credit to orginal website, March 1, 2026

మనిషి గొప్పా? మనిషి సృష్టించిన యంత్రం గొప్పా? దినదినాభివృద్ధి చెందుతున్న సాంకేతికత.. ప్రపంచాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నది. సరికొత్త ఆవిష్కరణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. కలలో కూడా ఊహించనంత వేగంగా సాగుతున్న ఈ పరుగు.. మనిషి ఉనికినే సవాల్‌ చేస్తున్నది. భవిష్యత్తుపై భయాందోళనలు రేపుతున్నది. మరి రాబోయే దశాబ్దం ఎలా ఉండబోతున్నది? అడుగడుగునా రోబోలు, అంతరిక్షంలో సర్వర్లు, చంద్రునిపై నగరాలు, మార్స్‌పై మానవ స్థావరాలు.. ఇలా ఎన్నెన్నో ఊహించని అద్భుతాలు కళ్ల ముందు సాక్షాత్కరించబోతున్నాయి.

2035 నాటికి మానవులు నిర్ణయాలు తీసుకోవడం మానేసి ఏఐ వ్యవస్థలు నిర్ణయం తీసుకుంటాయి. డేటా, ఏఐ వ్యవస్థలు మనుషుల కంటే ఎక్కువ శక్తిమంతంగా తయారవుతాయి.- యువల్‌ నోవా హరారీ, ప్రఖ్యాత చరిత్రకారుడు, రచయిత
నేడు మన జీవితంలో ఒక భాగంగా మారిన అనేక అంశాలు ఒకప్పుడు ఊహకు కూడా అందనివి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కంప్యూటర్‌, ఒక జీపీఎస్‌, ఒక ఫోన్‌ మన జేబుల్లో ఇమిడిపోతున్నాయి. చేతి వేళ్ల కొసన సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఇంటర్నెట్‌ కారణంగా ఇంటర్నేషనల్‌ గ్లోబల్‌ కనెక్టివిటీ సాధ్యం అవుతున్నది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌ మన సామాజిక సంబంధాలను పునర్నిర్వచించాయి. నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌ లాంటివి మన వినోద ప్రపంచాన్ని మార్చేశాయి. దైనందిన జీవితంలో అవసరమైన వస్తువులే కాదు. కోరుకున్న రుచులూ గుమ్మం ముందుకు వచ్చేస్తున్నాయి. కరెన్సీతో పనిలేకుండా లావాదేవీలు సులువుగా ఆన్‌లైన్‌లో పూర్తయిపోతున్నాయి. రిటైల్‌, షాపింగ్‌ అలవాట్లను ఈ-కామర్స్‌ రంగం సమూలంగా మార్చివేసింది.

అంతేనా? విమానయానం ద్వారా కొన్ని గంటల్లోనే ఖండాంతరాలను దాటడం సాధ్యం అవుతున్నది. కమ్యూనికేషన్‌ వ్యవస్థను వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, జూమ్‌ సులభతరం చేశాయి. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల మార్పిడి తేలికైపోయింది. జెనెటిక్‌ ఎడిటింగ్‌ ద్వారా వ్యాధులకు చికిత్స చేస్తున్నారు. ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధులుగా చెప్పుకొనే జబ్బులు ఇప్పుడు చికిత్సకు లొంగుతున్నాయి. ఇదంతా మానవ మేధస్సు సాధించిన ఘనత. సాంకేతికత ప్రసాదించిన వరం.
ఇంతింతై.. వటుడింతై అన్న చందంగా ఈ సాంకేతికత.. అదే కృత్రిమమేధ ఆకాశమంత ఎదుగుతున్నది. ఒకరకంగా అన్ని రంగాల్లోనూ విజృంభిస్తున్నది. వాషింగ్టన్‌ పోస్టు పత్రిక 1908 జనవరి 12న ‘అమెరికా భవిష్యత్తు’ పేరుతో ఒక పూర్తి పేజీ కథనాన్ని ప్రచురించింది. ఆలోచనాపరులుగా గుర్తింపు తెచ్చుకున్న కొందరు వ్యక్తుల అభిప్రాయాలు సేకరించింది. వాళ్లలో ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్‌ ఆల్వా ఎడిసన్‌ కూడా ఉన్నారు.
‘కొత్త ఆవిష్కరణలకు కాలం చెల్లినట్టేనా?’ అని సంపాదకులు ఎడిసన్‌ని అడిగారు. ఆ ప్రశ్నకు ఆయన విస్తుపోయాడు. “ముగిసిపోవటమా? ఇంకా అసలు ప్రారంభమే కాలేదు” అన్నాడు నవ్వుతూ! “ ఈ సమాధానం సరిపోతుందా? ఇంకేమైనా కావాలనుకుంటే అడగండి”.
“వచ్చే 50 ఏళ్లలో… గత అర్ధ శతాబ్దంలో మాదిరిగా యాంత్రిక, శాస్త్రీయ అభివృద్ధి సాధ్యం అవుతుందని మీరు విశ్వసిస్తున్నారా? “అవును. కచ్చితంగా. గొప్పగా.. చాలా ఉన్నతంగా…” “ ఏ లైన్‌లో..?” “అన్ని రంగాల్లో.. ఒకటని ఏముంది?” తాపీగా చెప్పాడు ఎడిసన్‌. గుడ్డిగా, కేవలం ఆత్మవిశ్వాసంతో చెప్పిన మాటలు కావవి. శాస్త్రీయ ఆవిష్కరణలు ఎలా చోటుచేసుకుంటాయనే అంశంపైన ఎడిసన్‌కి స్పష్టత ఉంది. 118 ఏళ్ల క్రితంతో పోలిస్తే ప్రపంచం ఊహించనంతగా మారిపోయింది. ఇది కల్పన కాదు. కళ్ల ఎదుట కనిపిస్తున్న వాస్తవం.
శతాబ్ది ఆవిష్కరణలు
1900-1925 మధ్య అంటే మొదటి పాతికేళ్లలో వచ్చిన ముఖ్యమైన ఆవిష్కరణల గురించి చెప్పాలంటే.. రైట్‌ సోదరులు విమానాన్ని కనిపెట్టింది ఈ కాలంలోనే! మొట్టమొదటి వైర్‌లైస్‌ టెలిగ్రాఫ్‌, మార్కొని రేడియోను కనుగొన్నది, అందరికీ కార్లు అందుబాటులోకి తేవడానికి హెన్రీఫోర్డ్‌ అసెంబ్లీ లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది.. డయాబెటిస్‌కి ఇన్సులిన్‌ కనుగొన్నది ఈ కాలంలోనే. టెక్నాలజీ పరంగా రేడియో, కంప్యూటర్‌లకు సంబంధించిన వాక్యూమ్‌ ట్యూబ్‌లను కూడా ఈ సమయంలోనే అభివృద్ధి చేశారు.
1925-50 నడుమ కమర్షియల్‌ ఎయిర్‌ ట్రావెల్‌ అనేది విస్తరించింది. మొట్టమొదటి కంప్యూటర్‌ వ్యవస్థ ఇనియాక్‌ని వృద్ధి చేశారు. వైద్యరంగంలో పెన్సిలిన్‌ని కనుగొన్నారు. అలాగే 1940 తర్వాత టెలివిజన్‌ అనేది పాపులర్‌ మీడియాగా వృద్ధి చెందడం మొదలైంది. అణురియాక్టర్‌ని,
ఆటంబాంబుని కనుగొన్నారు.
1950-75 మధ్యలో… 1969లో మొట్టమొదటిసారి మానవుడు చంద్రునిపైన అడుగుపెట్టాడు. మైక్రో ప్రాసెసర్లు, పర్సనల్‌ కంప్యూటర్లు ప్రారంభమయ్యాయి. ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌, ఎంఆర్‌ఐ మిషిన్లు అభివృద్ధి చేశారు. శాటిలైట్‌ కమ్యూనికేషన్‌, మొబైల్‌ ఫోన్లు పుట్టుకొచ్చాయి.
1975-2000లో ఇంటర్నెట్‌, వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ వృద్ధి చెందటం కీలక పరిణామం. బయోటెక్నాలజీ పరంగా జెనెటిక్‌ ఇంజినీరింగ్‌, క్లోనింగ్‌ వృద్ధి చెందింది. ఇంధన రంగంలోకి సోలార్‌ ప్యానెళ్లు, విండ్‌ టర్బైన్లు వచ్చి పడ్డాయి. మొబైల్‌ ఫోన్లు, ఈమెయిళ్లు అవసరాలుగా మారటం మొదలైంది. వైద్యరంగంలో జీన్‌ థెరపీ, స్టెమ్‌ సెల్‌ రీసెర్చి క్రియాశీలంగా మారాయి.
2000-2025 మధ్య మునుపెన్నడూ లేనంతగా సాంకేతికత పరుగులు తీసింది. స్మార్ట్‌ఫోన్లు, సోషల్‌ మీడియా, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లకు ప్రాధాన్యం పెరిగింది. బయోటెక్నాలజీలో జీన్‌ ఎడిటింగ్‌ ముందుకొచ్చింది. విద్యుత్‌ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం మీద దృష్టి పెరిగింది. వైద్యరంగంలో క్యాన్సర్‌ నివారణ చికిత్సల్లో ఇమ్యునోథెరపీ లాంటి అధునాతన పద్ధతులు ప్రవేశించాయి. అంతరిక్ష శోధనలో స్పేస్‌ ఎక్స్‌ లాంటి ప్రైవేట్‌ కంపెనీలు ప్రవేశించాయి. నాసా, ఇస్రోలాంటి ప్రభుత్వ సంస్థలకు దీటుగా భవిష్యత్‌లో ప్రపంచానికి కొత్త ఆవిష్కరణలను పరిచయం చేస్తామని చెబుతున్నాయి.

భవిష్యత్తులో తలెత్తే అన్ని పరిణామాలను అంచనా వేయటం ఎవరికైనా సాధ్యం కాని పని. ఒకప్పుడు తుఫాన్‌లు, భూకంపాలు, సునామీలను అంచనా వేయటం వీలయ్యేది కాదు. ఇప్పుడు శాస్త్రీయ పరిశోధనల పుణ్యమా అని చాలా విషయాలను మనం ముందుగానే తెలుసుకోగలుగుతున్నాం. తగిన సమయంలో హెచ్చరికలు జారీ చేస్తున్నాం. వాటి ఆధారంగా మనం స్పందిస్తున్నామా లేదా అనేది వేరే విషయం. కరోనా లాంటి విపత్తులు, స్టాక్‌ మార్కెట్‌ సంక్షోభాలు, దేశాల మధ్య యుద్ధాలు ఇవి ఊహించటానికి సాధ్యం కానివి. వాటిని అప్పటికప్పుడు ఎదుర్కొని తీరవలసిందే. కాకపోతే వాటికి సంబంధించిన ముందస్తు హెచ్చరికలు వస్తాయి. అవి ఉత్పాతంగా మారి మన ముందు ప్రత్యక్షమయ్యే వరకూ అంతగా పట్టించుకోం. ఇవి మనకు సంబంధించని వ్యవహారాలుగానే చూస్తాం. వైరస్‌లు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి. అదేమంత పెద్ద విషయం కాదని అనుకుంటాం. ఇతర దేశాల్లో మరణాలు సంభవిస్తున్నాయని ప్రభుత్వాలు, ప్రజలు కూడా లెక్కచేయరు. మానవుల అంచనాలకు అందనంత వేగంగా వైరస్‌ విరుచుకుపడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నప్పుడు నిస్సహాయంగా తలొంచుకోవలసిన పరిస్థితి ఎదురవుతుంది.
స్టాక్‌ మార్కెట్‌ హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పడిపోవటం లాంటి వాటితో వచ్చే నష్టం ఏముంది అనుకుంటాం? అదేదో దేశంలో యుద్ధాలు, దేశాల మధ్య కీచులాటలు.. ఇవన్నీ మనకేం సంబంధం అనుకుంటాం. స్టాక్‌ మార్కెట్లు దెబ్బతింటే బాస్‌లు తమ పొదుపు సొమ్మును కోల్పోతారు. దాంతో తమ దగ్గర పనిచేసే ఉద్యోగులను తొలగించి బయటికి పంపుతారు. ఆ ఉద్యోగులు రోడ్డున పడతారు. బ్యాంకులకు చెల్లించవలసిన అప్పులు బకాయి పడతారు. పొదుపు చేయటం తగ్గుతుంది. బ్యాంకుల్లో పొదుపు సొమ్ము తగ్గితే అవి రుణాలు ఇవ్వటం తగ్గిస్తాయి. ప్రజలు తగినంత డబ్బు లేకపోతే కొనుగోళ్లు తగ్గిస్తారు. దాని ప్రభావం వ్యాపారాలపైనా పడుతుంది. వ్యాపారాలు తగ్గటం వల్ల కూడా బ్యాంకులు దెబ్బతింటాయి. బ్యాంకులు నష్టపోవటం వల్ల ప్రజలు పొదుపు చేయలేకపోతారు. ఇది గొలుసుకట్టులా సాగుతూనే ఉంటుంది. ఓ వైపు ధరలు పెరుగుతూ, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెరగక, జీవిక భారంగా తయారవుతున్నప్పుడు ‘బేర్‌’మంటాం.
చాలా పరిణామాలు ప్రారంభంలో చాలా చిన్నవిగానే కనిపిస్తాయి. వాటిని సరిగ్గా అంచనా వేసి, స్పందిస్తే నష్టం తక్కువగా ఉంటుంది. విస్మరిస్తేనే పెద్ద విపత్తుగా మారుతుంది. కొవిడ్‌ 19 విషయాన్నే చూద్దాం. ఒక వైరస్‌ మానవ శరీరంలోకి ప్రవేశించింది. అది ఎప్పుడూ చోటు చేసుకునే అంశం. ఆ వ్యక్తులు మరికొందరిని కలిశారు. ఇది కూడా సాధారణ అంశమే. అలా కొన్ని రోజులు గడిచాయి. కానీ, అది ప్రమాదకరమని గ్రహించాక ఆంక్షలు విధించడం మొదలైంది. మొదట్లో తేలిగ్గా తీసుకున్నాం. ఇతర దేశాల్లో కూడా అదే పరిస్థితి ఉంటుందని భావించాం. ప్రామాణికమైన తిరస్కరణ ఇది. దానితో తగినంత వేగంగా చర్యలు తీసుకోవటానికి అధికార యంత్రాంగం సిద్ధపడలేదు. అతి ఆశావాదంతో వ్యవహరించాం. ఏం చేయాలనే భయాందోళనల మధ్య నిర్బంధంగా లాక్‌డౌన్‌ విధిస్తే గానీ పరిష్కారాలు కనుగొనటం సాధ్యం కాలేదు. ఇది ఏ ఒక్క దేశానికో పరిమితమైన అంశం కాదు. యావత్‌ ప్రపంచం నేర్చుకోవలసిన పాఠం అని గుర్తించారు. మానవుల ఆలోచనా సరళిలో, జీవన విధానంలో మార్పు తెచ్చిన అతిపెద్ద అంశం ఏదైనా ఉందీ అంటే అది కరోనా అని చెప్పుకోక, ఒప్పుకోక తప్పదు.
గతంలోనే.. ఫ్యూచర్‌ షాక్‌
ఆల్విన్‌ టోఫ్లర్‌ 1970లో తన ‘ప్యూచర్‌ షాక్‌’ పుస్తకంలో భవిష్యత్తు గురించి, సమాజం గురించి అనేక ఆసక్తికరమైన అంచనాలను రూపొందించారు. అవి అప్పట్లో వింతగా అనిపించినా మన జీవితంలో భాగంగా మారాయి.
సమాచార విస్పోటనం: సమాచార లభ్యత వల్ల మనిషి నిర్ణయాలు తీసుకోవటంలో తడబడతాడని, దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుందని అంచనా వేశారు.
నాలెడ్జ్‌ ఎకానమీ: భవిష్యత్తులో శారీరక శ్రమ కంటే జ్ఞానం, సమాచారం, డేటా ఆధారిత ఆర్థిక వ్యవస్థలే రాజ్యమేలతాయని ఆయన ఊహించారు.
ప్రొజ్యూమర్స్‌: వినియోగదారులు కేవలం వస్తువులను కొనటమే కాకుండా తమకు కావలసిన వస్తువులను డిజైన్‌ చేయటంలో లేదా ఉత్పత్తి చేయటంలో భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. నేడు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లలో సాగుతున్న కంటెంట్‌ క్రియేషన్‌ దీనికి మంచి ఉదాహరణ.
నోస్ట్రడామస్‌ జోస్యం
మైఖేల్‌ డి నోస్ట్రడామస్‌ 16వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఫ్రెంచి జ్యోతిషుడు. భవిష్యత్తును అంచనా వేయడంలో ఉద్దండుడిగా ప్రపంచ దేశాలు ఇతణ్ని కీర్తిస్తుంటాయి. ఆయన రాసిన పుస్తకం ‘లెస్‌ ప్రొఫెటీస్‌’ (ది ప్రొఫెసీస్‌). ఇందులో నోస్ట్రడామస్‌ పేర్కొన్న ఎన్నో విషయాలు నిజమయ్యాయని చెబుతుంటారు. ప్రధానంగా ఐరోపాలో అడాల్ఫ్‌ హిట్లర్‌ ఆధిపత్యం, ప్రపంచ యుద్ధం, సెప్టెంబరు 11న ఉగ్రదాడులు, కొవిడ్‌ 19 మహమ్మారి వంటి అంశాలను పేర్కొంటారు. హెన్రీ 2 మరణం, లండన్‌లో అగ్ని ప్రమాదం, ఫ్రెంచి విప్లవం గురించి కూడా ఆయన ముందుగానే చెప్పారని అంటారు.
ఆయన రచనలు కావ్యరూపంలో ఉంటాయి. ఆ క్వాంట్రెయిన్స్‌ (పద్యాలు)ను అర్థం చేసుకోవటం కష్టం అన్న అభిప్రాయం కూడా ఉంది. కీలక పరిణామాలు చోటుచేసుకున్నప్పుడు నోస్ట్రడామస్‌ ఏం చెప్పాడా? అనేది పరిశీలించడం, వాటిపైన విశ్లేషణలు రావడం పరిపాటిగా మారింది. ప్రతి సంవత్సరం ఆరంభంలో మీడియా నోస్ట్రడామస్‌ను గుర్తు చేసుకుంటుంది. 2025లో ఓ పెద్ద గ్రహశకలం భూమిని ఢీ కొట్టవచ్చని, లేదా అత్యంత ప్రమాదకరంగా సమీపానికి రావచ్చని, దీర్ఘకాలిక యుద్ధానికి తెరపడుతుందని, బ్రెజిల్‌లో వరదలు, అగ్నిపర్వతాలు వంటివి బద్దలవుతాయని అంచానా వేసినట్టుగా చెప్పారు. ఇందులో ఏవి నిజమయ్యాయి? ఏవి కాలేదు అనేది ఎవరికి వారు విశ్లేషించుకోవల్సిందే!
పదేళ్ల తర్వాత …
2036లో ప్రపంచం ఏ విధంగా మార్పు చెందుతుందనేది ఆసక్తికరమైన అంశం. ఇది ఏఐ ప్రపంచం. ఆటోమేషన్‌ సమాజం. సాంకేతిక విప్లవం మునుపెన్నడూ లేనంత విధంగా పరిణామాలను మార్చి వేస్తున్నది. రాబోయే రోజుల్లో యాప్‌ల వాడకం తగ్గి మనం కోరిన పనులు చేసిపెట్టే ఏఐ ఏజెంట్లు ప్రాచుర్యంలోకి వస్తాయి. ఇవి సాఫ్ట్‌వేర్‌తో నేరుగా సంభాషించి పనులను పూర్తి చేస్తాయి. రవాణా, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో రోబోల వాడకం విపరీతంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు చంద్రుడి మీద నగరాలు, అంగారకుడిపైన మానవ స్థావరాలను ఏర్పాటు చేయడానికి ప్రస్తుత అంతర్జాతీయ సంస్థలు, ప్రైవేట్‌ కంపెనీలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర బేస్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే రాబోయే పదేళ్లలో అక్కడ స్వయంగా అభివృద్ధి చెందే నగరాన్ని ఏర్పాటు చేయాలని స్పేస్‌ ఎక్స్‌ ప్రయత్నిస్తున్నది. 2047 నాటికి చంద్రుని మీద క్రూ స్టేషన్‌ నిర్మించాలని ఇస్రో సిద్ధం అవుతున్నది. అక్కడ ఖనిజాల వెలికితీత చేపట్టాలని భావిస్తున్నది.
ఇప్పటి వరకు చాట్‌ జీపీటీ, చాట్‌ బాట్లు, క్లౌడ్‌ సర్వర్లు మాత్రమే చూశాం. రాబోయే రోజుల్లో భూమికి అల్లంత దూరాన సర్వర్లను ఏర్పాటు చేస్తారు. విద్యుత్తు ఖర్చు లేకుండా సోలార్‌ ఎనర్జీని వాడుకుంటారు. 2036 నాటికి మనుషుల కంటే తెలివిగా పనిచేసే స్థాయికి ఏఐ చేరుకుంటుందని అట్లాంటిక్‌ కౌన్సిల్‌ లాంటి సంస్థల ప్రకటనలు ప్రపంచంలో కలవరం రేపుతున్నాయి. ఇప్పటికే టెక్నాలజీ అంటే జనాల్లో భయం పెరిగిపోయింది. మన రోజువారీ పనులను, ఉత్పత్తిని ఏఐ సాయంతో యంత్రాలే చేసేస్తుంటే అవి తమ ఉపాధిని మింగేస్తున్నాయన్న భయాందోళనలు పెరిగిపోయాయి.
మారాల్సిందేనా..
విద్య, వైద్యం, వ్యవసాయం, న్యాయశాఖ ఇలా ఏ రంగంలో చూసినా ఏఐ కారణంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయనేది వాస్తవం. ఉద్యోగాల స్వరూప స్వభావాలను ఏఐ, ఆటోమేషన్‌ మార్చివేస్తాయి. కొత్త నైపుణ్యాలతో సిద్ధం అయ్యారా సరే, లేకపోతే ఇంటికే అన్న సందేశాన్ని బలవంతంగా అందిస్తాయి. నిజంగా ఇది ఉద్యోగులకు సవాలుగా నిలిచే అంశమే. కంప్యూటర్‌ వచ్చిన కొత్తలో దాని వల్ల ఉద్యోగాలు పోతాయనే కలవరం, భయం చాలామందిలో ఉండేది. ఇప్పుడు ఏఐ విషయంలోనూ అంతే. కంప్యూటర్లకు అలవాటు పడిన తర్వాత సమాజం ఎంత వేగంగా పరివర్తన చెందిందో, పనిలో వేగం, సౌకర్యం పెరిగాయో అంతకంటే వేగంగా ఈ కొత్త సాంకేతికత తోడ్పడుతుంది. దానిని ఓ స్నేహితునిలా స్వీకరించాలి. పెంపుడు జంతువులా మచ్చిక చేసుకోవాలి. ఓ ప్రియురాలి మాదిరిగా గాఢమైన ఆర్తిని ప్రదర్శించాలి. ఓ జీవిత భాగస్వామిగా సహజీవనం చేయాలి. అప్పుడే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది.

వైద్యరంగంలోనూ..
వైద్యరంగంలోనూ విప్లవాత్మక మార్పులు సంభవిస్తాయి. కేవలం మన శరీరాన్ని పరీక్షించి మాత్రమే కాదు. మన తాత తండ్రులు, తాతలు, తండ్రులు ఇలా జెనెటిక్‌ ఇన్ఫర్మేషన్‌ను ఉపయోగించి వ్యాధులను డయాగ్నైజ్‌ చేయటం మొదలవుతుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే ఆరోగ్య సంరక్షణలో ప్రివెంటివ్‌ జెనోమిక్స్‌ ప్రాధాన్యం పెరుగుతుంది. అయితే పరీక్షలకు వెళ్లినప్పుడు డాక్టర్‌ తమను అంతగా పట్టించుకోలేదనే అభిప్రాయాన్ని చాలామంది రోగులు వ్యక్తం చేస్తూంటారు. ఓ ఐదు నిముషాలు అదనంగా సమయం వెచ్చించి, ఓపిగ్గా తాము చెప్పేది వినేవారిని మంచి వైద్యులుగా చూస్తారు. ఇప్పుడు వైద్యుడు ఓ యంత్రం. దానికి భావోద్వేగాలతో సంబంధం ఉండదు. మరి అప్పుడు రోగులకు సంతృప్తి కలుగుతుందా? అనేది ఆసక్తికరమైన ప్రశ్న.
దీనికి రెండు సమాధానాలు చెప్పుకోవాలి. జనం ఏఐ వైద్యానికి పూర్తిగా విముఖంగా లేరు. 2025లో నిర్వహించిన ‘ఇప్పాస్‌ సర్వేలో 38 శాతం మంది ఏఐను ఉపయోగించి వైద్యసేవలను పొందటానికి అంగీకారం తెలిపారు. విశ్వాసం, వ్యక్తిగత ఇంటరాక్షన్‌కి వైద్యుడు ఉంటే మంచిదని 52 శాతం మంది అభిప్రాయపడ్డారు. అందుకే వైద్యుడు.. ఏఐ సాధనాలను ఉపయోగించుకుని వైద్యం చేయడం మొదలుపెడితే ప్రజల మెప్పు పొందడం తథ్యం. ఎంటర్‌టైన్మెంట్‌ రంగంలో కూడా ఏఐ ఎన్నో మార్పులను తెస్తున్నది. వీక్షకుల ప్రాధాన్యాలను అర్థం చేసుకుని సినిమాలు రూపుదిద్దుకుంటాయి. వారికి అనుగుణంగా కథనాలు సృష్టిస్తున్నారు. ఇది ఇప్పటికే ప్రారంభమైనా మరికొన్ని మార్పులు తప్పవు.
రాబోయే రోజుల్లో ఏఐ వ్యవస్థలు వ్యక్తిగత ప్రాధాన్యాలను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా మరింతగా సేవలను అందిస్తాయి. ‘హైపర్‌.. హైపర్‌.. పర్సనలైజేషన్‌’ అన్న మాట. దానితో మానవులు వాటిపైన ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఏఐ.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అన్న పేరులోనే ఉంది. ఈ తెలివితేటలు కృత్రిమమైనవి. మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయమైనవి కావు. త్వరితగతిన మానవుని అవసరాలు తీర్చడానికి ఉపకరించే సాధనాలుగా మాత్రమే చూడాలి. అలాగని దాని శక్తిని తక్కువగా అంచనా వేసినా, కాదనుకుని దూరంగా జరిగినా మీరు అభివృద్ధి నిరోధకుల కిందే లెక్క. అది 2026లో అయినా.. 2036లో అయినా!!
అంచనాలు ఢమాల్‌

మేధావులు, శాస్త్రవేత్తలు కూడా కొన్నిసార్లు పప్పులో కాలేస్తారు. భవిష్యత్తును సరిగా అంచనా వేయలేరు. అందుకు కొన్ని ఉదాహరణలను చూద్దాం.
ఈథర్నెట్‌ ఆవిష్కర్త రాబర్ట్‌ మెట్‌ కఫే ఓ సందర్భంలో మాట్లాడుతూ, 1996 వచ్చేనాటికి ఇంటర్‌నెట్‌ కుప్పకూలుతుందని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు తర్వాత రోజుల్లో నాలుక కరుచుకున్నాడు.
డిజిటల్‌ ఎక్విప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వ్యవస్థాపకుడు కెన్‌ ఓల్సన్‌, అసలు ఇళ్లలో కంప్యూటర్‌ అవసరం ఏం ఉంటుంది? అని పర్సనల్‌ కంప్యూటర్స్‌ ఆవశ్యకతను గట్టిగా ప్రశ్నించాడు. ఇది 1977నాటి మాట. ఈ 50 ఏళ్లలో ఈ రంగంలో వచ్చిన మార్పులను చూసినప్పుడు ఆయన వ్యాఖ్యల్లో డొల్లతనం
మనకు అర్థం అవుతుంది.

స్టీవ్‌ బాలిమర్‌ తెలుసుగా.. మైక్రోసాఫ్ట్‌ సీఈఓ.. 2007లో ఐఫోన్‌ గురించి చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. దానికి ఏ మాత్రం మార్కెట్‌ ఉండదని చెప్పాడు. ఐఫోన్‌తో యాపిల్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో మనం చూస్తూనే ఉన్నాం. మైక్రోసాఫ్ట్‌కి కూడా ఐఫోన్‌ మార్కెట్‌లో ప్రాతినిధ్యం ఉంది. హార్ట్‌వేర్‌ కాంపిటేటర్‌గా కాదు. సాఫ్ట్‌వేర్‌, ప్రొడక్టివిటీ ప్రొవైడర్‌గా.ఈ లోకం.. డెరిల్‌ జనక్‌ అనే భౌతిక శాస్త్రవేత్త టెలివిజన్‌ ఆరు నెలల్లో మాయమవుతుందని ప్రకటించాడు. ఇది 1946లో చెప్పిన మాట అని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 1929లో ఒకాయన స్టాక్‌ ధరలు అత్యున్నత స్థాయికి చేరాయని ఇంకా భవిష్యత్తులో ఈ స్థాయిని అందుకోవటం సాధ్యం కాదని ప్రకటించాడు.
మీరు గమనించారా?
గత 50 ఏళ్లలో మన కండ్లముందు నుంచి కొన్ని వస్తువులు మాయమయ్యాయి. ఫౌంటెన్‌ పెన్‌ అంటే పడి చచ్చేవాళ్లు జనం. ఇప్పుడు ఇంక్‌ పెన్‌ ఆచూకీనే లేదు. వీహెచ్‌ఎస్‌ టేపుల స్థానంలో డీవీడీలు, బ్లూరేస్‌, స్టీమింగ్‌ సర్వీసెస్‌ వచ్చేశాయి. టెలిఫోన్‌ బుక్‌లు మాయమయ్యాయి. ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లో వెతుక్కునే సౌలభ్యం వచ్చింది. కార్బన్‌ పేపర్లు, టైప్‌ రైటర్లు, యాష్‌ ట్రేలు, చిన్నారులు పాలు తాగే గ్లాస్‌ బేబీ బాటిల్స్‌, రికార్డు ప్లేయర్‌ కంసోల్స్‌ ఇప్పుడు కనిపించడం లేదు. కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి.
2036 నాటికి ప్రపంచం ఇలా..
డాక్టర్‌ ఏఐ
ఉదయాన్నే పరిగెత్తుకు వెళ్లి డాక్టర్‌ అప్పాయింట్‌మెంట్‌ కోసం పడిగాపులు కాయాల్సిన పనిలేదు. రిసెప్షనిస్టు దగ్గరికి వెళ్లి మన జబ్బుల వివరాలను అందించి ఫైల్‌ తీసుకోవలసిన పనిలేదు. ఇప్పుడు ఏఐ డాక్టర్‌ మీకు అందుబాటులో ఉంది. పేషెంట్‌ మెడికల్‌ హిస్టరీని చూసి సమాచారాన్ని క్రాస్‌ చెక్‌ చేయటమే కాదు. ప్రీ డయాగ్నసిస్‌కి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలో చూడటానికి వైద్యుడు సిద్ధంగా ఉంటాడు.ముఖాముఖీగా మీ నేపథ్యాన్ని ఏఐ పూర్తిగా వింటుంది. వేలాది వైద్య అధ్యయనాలు, పరిశోధనల ఆధారంగా పరిస్థితిని బేరీజు వేయగలుగుతుంది. దానికి తగిన విధంగా వైద్య సలహాలను అందించగలుగుతుంది. ఇంత విస్తృతంగా పరిశీలించటం అనేది మామూలు డాక్టర్లకు సాధ్యం కాని పని. మెడికల్‌ స్క్రీనింగ్‌ అనేది మరింత అధునాతనంగా మారుతుంది. మీరు ధరించే ఉపకరణాలు (వేరబుల్‌ డివైజెస్‌) ద్వారా మీరు తినే ఆహారం, వైటల్‌ స్టాటిస్టిక్స్‌ అందిస్తుంది. స్మార్ట్‌ టాయ్‌లెట్స్‌ మీ కడుపులో కదలికలను సైతం గుర్తించి సలహాలు ఇవ్వగలుగుతాయి. మీ శరీరం, దాని అవసరాలకు తగ్గట్టుగా మందులు రూపుదిద్దుకుంటాయి.
ఆఫీసుల్లో ఇలా..
ఏఐ అసిస్టెంట్లు.. సాధారణ మనుషుల మాదిరిగానే అన్నింటినీ అర్థం చేసుకోగల సాఫ్ట్‌వేర్‌ ఏజీఐ (ఆర్థిఫిషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌) వ్యవస్థలుగా రూపుదిద్దుకుంటాయి. ఆఫీసుల్లో పని విధానంలో గణనీయమైన మార్పు వస్తుంది. సమావేశానికి మీరు వచ్చేసరికి మీ ఏఐ సహాయకుడు మీకు అవసరమైన డాక్యుమెంట్లను, స్ప్రెడ్‌షీట్లను మీ ముందు ఉంచుతుంది. సమావేశం అనంతరం తీసుకోవలసిన చర్యలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందిస్తుంది. వ్యక్తులు ఎవరైనా ఒత్తిడికి గురైతే ఆ సమాచారం కూడా అందిస్తుంది. విశ్రాంతి సమయం పెరుగుతుంది. ఎక్కువ పనిగంటలతో శ్రమపడటం అలవాటైన వ్యక్తుల్లో కొందరు ఈ కొత్త పని విధానాన్ని అంత త్వరగా జీర్ణించుకోలేకపోవచ్చు. ఇది మానసిక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుందని హెచ్చరికలు చేస్తున్నారు. స్పోర్ట్స్‌ క్లబ్‌లు, లైవ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ప్రదేశాలలో ట్రావెల్‌ ఏజెంట్ల స్థానంలో ఏఐ వ్యవస్థలు దర్శనమిస్తాయి.
రైతులకూ మేలు…
పశుసంపద ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, పంటల తీరుతెన్నులను పరిశీలించడం కోసం రేయింబవళ్లు శ్రమపడే రైతుకు ఏఐ సహాయకారిగా నిలుస్తుంది. ఏఐ ఆధారిత టెక్నాలజీ అంటే.. కెమెరాలను, సెన్సర్లను చెట్లకు, ఫెన్స్‌ పోస్టులను అమర్చటం, అలాగే ఇటినరీ రొబోట్స్‌ వంటి మొబైల్‌ మెషినరీ అమర్చడం వల్ల పశువుల సంక్షేమానికి అవసరమైన సమాచారం అందుతుంది. 2025లోనే ఇందుకు సంబంధించిన ప్రయోగాత్మక చర్యలు ప్రారంభమయ్యాయి.
– డాక్టర్‌ పార్థసారథి చిరువోలు
 

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • కలర్స్ హెల్త్ కేర్ 2.O సేవ‌లు ప్ర‌శంస‌నీయం
  • రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ : సీఎం
  • సహజ వ్యవసాయానికి ప్రోత్సాహం : అచ్చెన్న
  • వ్యవసాయ యాంత్రీకరణకు అధిక ప్రాధాన్య‌త
  • అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ప‌థ‌కంతో భ‌రోసా

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes