అమరావతి : ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ సహజ వ్యవసాయం (APCNF) ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రస్తుతం 8,168 గ్రామాల్లో 13.10 లక్షల ఎకరాల్లో సహజ వ్యవసాయం సాగుతోందన్నారు. రైతులకు అవసరమైన ఇన్‌పుట్లు అందించేందుకు 1,712 బయో సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. 2.83 లక్షల మంది రైతులు 3.55 లక్షల ఎకరాల్లో రసాయన రహిత S2S విధానాన్ని అనుసరిస్తుండగా, 10.38 లక్షల మంది రైతులు PGS సర్టిఫికేషన్‌లో నమోదు చేసుకున్నారని అన్నారు. 33 వేల మంది రైతులు స్కోప్–ఆర్గానిక్ ధృవీకరణ పొందారని తెలిపారు. 2026-27లో APCNF కోసం రూ.208 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించామని వెల్లడించారు.
రైతు సంక్షేమం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ రంగం కీలకమని పేర్కొంటూ, 2026-27 వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ శాఖకు మొత్తం రూ.12,152.32 కోట్లు ప్రతిపాదించామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతు ఆదాయం పెంపు, సమర్థ వనరుల వినియోగమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వ్యవసాయ పథకాల అమలులో కేంద్ర, రాష్ట్ర నిధుల సమన్వయం అత్యంత కీలకమని మంత్రి తెలిపారు. సాధారణంగా కేంద్రం 60%, రాష్ట్రం 40% నిష్పత్తిలో నిధులు అందిస్తాయని పేర్కొన్నారు. 2014–19 మధ్య తెదేపా హయాంలో రాష్ట్ర వాటాను సమయానికి విడుదల చేసి, కేంద్ర నిధులను పూర్తిగా వినియోగించడమే కాకుండా అదనపు నిధులు కూడా పొందినట్లు వివరించారు.
అయితే గత ప్రభుత్వం హయాంలో 2022-23 నుండి రాష్ట్రం తన 40% వాటాను SNA ఖాతాలకు సమయానికి జమ చేయక పోవడంతో కేంద్రం కేటాయించిన 60% నిధులు కూడా వినియోగించ లేకపోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వ్యవసాయ శాఖలో 2022-23లో రూ.300 కోట్లకు గాను కేవలం రూ.100 కోట్లు, 2023-24లో రూ.322 కోట్లకు గాను రూ.121 కోట్లు మాత్రమే వినియోగించారని తెలిపారు. ఉద్యాన శాఖలో కూడా రాష్ట్ర వాటా విడుదలలో జాప్యం కారణంగా కేంద్రం విడుదల చేసిన రూ.260 కోట్లను ఉపయోగించలేక పోయారని, ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ నిధులను రైతులకు అందించామని వెల్లడించారు.
The post సహజ వ్యవసాయానికి ప్రోత్సాహం : అచ్చెన్న appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
