Hyderabad | కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు వల్ల పరీవాహక ప్రాంత ప్రజలు కంటిమీద కునుకు లేకుండా బతుకీడుస్తున్నారు. ఎప్పుడు ఏ అధికారి వచ్చి తమ ఇండ్లకు మార్కింగులు వేస్తారో.. ఎప్పుడు ఎవరు వచ్చి తమ ఇండ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తారో తెలియని అయోమయంలో జీవనం సాగిస్తున్నారు. కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకుని స్థలం కొనుక్కోని బ్యాంకు లోన్లు తెచ్చుకుని ఇండ్లు కట్టుకుంటే.. ఆ సంతోషాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిరి చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇండ్లు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఉండటంతో అప్పటి నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వమే ఇండ్లను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఎవరికి చెప్పుకోవాలో.. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో బతుకీడుస్తున్నారు. ఇండ్లు కట్టుకునేందుకు ప్రభుత్వమే అన్ని అనుమతులిచ్చి ఇప్పుడు ప్రభుత్వమే తమ ఇండ్లు బఫర్ జోన్లో ఉన్నాయని.. ఖాళీ చేయాలని ఆదేశాలిస్తుంటే ఎవరిని అడగాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు.
సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : గాంధీ సరోవర్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రూ.7 వేల కోట్లతో మూసీ పునరుజ్జీవంలో భాగంగా హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ దాకా నిషేధిత ప్రాంతం, రివర్ బెడ్, బఫర్ జోన్లను గుర్తిస్తూ మార్కింగ్‌లు చేస్తున్నది. హిమాయత్ సాగర్, కిస్మత్పూర్ గ్రామాల పరిధిలో జలాశయం నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న నిర్మాణాలను ఖాళీ చేయాలని అధికారులు చెబుతున్నారు. ఓఆర్ఆర్ లోపల రివర్బెడ్, బఫర్ జోన్‌ను నిర్ధారిస్తూ రివర్ బెడ్ నుంచి 50 మీటర్ల దూరంలో ఉన్న నిర్మాణాల సర్వేనెంబర్లను నోటిఫికేషన్లో పేర్కొని ఖాళీ స్థలాలు, ఇండ్లకు మార్కింగ్‌లు చేస్తున్నారు. హిమాయత్‌సాగర్, కిస్మత్‌పూర్‌లోని కొంత భాగంతో పాటు హైదర్షాకోట్, గంధంగూడలోని 15 కాలనీల్లో వందలాది ఇండ్లు ప్రభుత్వం గుర్తించిన బఫర్, నిషేధిత ప్రాంతంలో ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాలు, కాలనీల ప్రజలు తమ ఇండ్లు పోతాయేమోనని భయాందోళనలకు గురవుతున్నారు.
Himaya
1500 ఇండ్లు గుర్తింపు
గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా హిమాయత్‌సాగర్ నుంచి బాపుఘాట్ దాకా ప్రభుత్వం రూ.7 వేల కోట్లతో మూసీ సుందరీరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగా వివిధ సర్వే నంబర్లలో ఉన్న నిర్మాణాలను స్వాధీనం చేసుకుంటామని.. అభ్యంతరాలుంటే చెప్పాలని వెల్లడించింది. ప్రభుత్వం ఇచ్చి నోటిఫికేషన్ ప్రకారం బాపుఘాట్ నుంచి కిస్మత్పూర్ దాకా 15 కాలనీల సర్వేనంబర్లు ఉన్నాయి. అందులో శివపురి కాలనీ, దత్తాత్రేయనగర్, విగ్నేశ్వర నగర్, డ్రీమ్ వ్యాలీ, కార్నివాల్ కాలనీ, పీజీ కాలనీ, విశాల్ నగర్, ఫోర్ట్‌వ్యూ అపార్ట్మెంట్స్, కేంద్రీయ విహార్, సాయిరాం నగర్, మధు పార్క్ రిడ్జ్, హైదర్ ఎన్క్లేవ్, ఆఫీసర్స్ కాలనీ, రిచ్మండ్ విల్లాస్, మెఫిల్ టౌన్ కాలనీల్లోని మూసీ నదికి 50 మీటర్ల దూరంలో ఉన్న ఇండ్లకు అధికారులు మార్కింగ్‌లు చేశారు.
ఈ 15 కాలనీల్లో సుమారుగా 1500 ఇండ్లు బఫర్‌జోన్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. అన్ని కాలనీలు హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం అన్ని ప్రభుత్వ అనుమతులతో ఏర్పడినవే. ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు చెల్లించారు. పట్టా భూముల్లోనే ఇండ్లను నిర్మించుకున్నారు. కానీ అధికారులు మాత్రం బఫర్‌జోన్‌లో ఉన్నాయని ఖాళీ చేయాలని నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆయా కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. మూసీని అభివృద్ధి చేయడానికి మా ఇండ్లను కూల్చడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో తమ ఇండ్లను ఇవ్వబోమని తేల్చి చెబుతున్నారు.
హిమాయత్‌సాగర్ గ్రామంపై కన్ను
హిమాయత్‌సాగర్‌ను ఆనుకొని ఉన్న హిమాయత్‌సాగర్ గ్రామంలో దాదాపు సగం ఇండ్లు ఉన్న సర్వే నంబర్లను నోటిఫికేషన్లో పేర్కొన్నారు. హిమాయత్‌సాగర్ గ్రామంలోని 40-48 సర్వేనంబర్లలో ఉన్న ఇండ్లను రిజర్వాయర్‌కు 500 మీటర్లు దూరంలోని నిషేధిత ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆయా సర్వే నంబర్లలో 100 కంటే ఎక్కువగా ఇండ్లు ఉన్నాయి. అయితే హిమాయత్‌సాగర్ గ్రామం వందేండ్ల కిందట రిజర్వాయర్ నిర్మించేటప్పుడే ఏర్పడింది. నాడు జలాశయం నిర్మాణంలో పనిచేసిన కార్మికులు అప్పటి నిజాం ప్రభుత్వం భూములను గ్రామం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి వారికి దశల వారీగా 2003, 2010, 2013లో అప్పటి ప్రభుత్వాలు పట్టాలు కూడా ఇచ్చాయి.
అయితే 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జంట జలాశయాల డౌన్ స్ట్రీమ్ నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని నిషేధిత జాబితాలో చేర్చింది. కానీ 2010, 2013లో అదే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు పట్టాలు జారీచేసింది. అదేవిధంగా రిజర్వాయర్‌కు 500 మీటర్ల దూరంలో ఓఆర్ఆర్లో భూములు కోల్పోయిన 40 మందికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ప్లాట్లను ఇచ్చింది. హిమాయత్‌సాగర్ నిషేధిత ప్రాంతంలో ఉంటే అప్పటి ప్రభుత్వాలు పట్టాలు ఎలా ఇచ్చాయని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నాటి నిజాం ప్రభుత్వం తమకు ఆ ప్రాంతంలో భూములను ఎలా ఇచ్చిందని నిలదీస్తున్నారు. ఇచ్చేది మీరే లాక్కునేది మీరేనా? అంటూ గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.
హిమాయత్‌సాగర్ మా వారసత్వం
హిమాయత్‌సాగర్ గ్రామంలో రిజర్వాయర్ నిర్మాణంలో కూలీ పని చేసినందుకు నాటి నిజాం ప్రభుత్వం మాకు భూములిచ్చింది. అప్పటి నుంచి మూడు తరాలుగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాం. 2003లో టీడీపీ ప్రభుత్వం, 2010, 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పట్టాలిచ్చింది. కానీ ఇప్పుడు ఆ భూములు నిషేధిత ప్రాంతంలో ఉన్నాయని 500 మీటర్ల దాకా ఉన్న స్థలాలను స్వాధీనం చేసుకుంటామంటున్నారు. నిషేధిత ప్రాంతం అయితే ప్రభుత్వం పట్టాలెలా ఇచ్చింది? ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లాలి? కుటుంబాలను రోడ్డున పడేస్తే ఏంచేయాలి? ప్రభుత్వం ఇప్పటికైనా మా ఇండ్ల జోలికి రాకుండా, మా గ్రామాన్ని కదపకుండా మూసీని అభివృద్ధి చేయాలని కోరుతున్నాం.
– ఆంజనేయులు, మాజీ సర్పంచ్
