అమరావతి : గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు డబ్బులు చెల్లించి, ఫ్లాట్ కేటాయింపులు జరగని వారికి వాళ్ల దరఖాస్తు సొమ్ము తిరిగి చెల్లించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 83,865 మంది దరఖాస్తుదారులకు రూ.174 కోట్లు వెనక్కి ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో నిర్మాణం పూర్తైన 1,00,875 టిడ్కో ఇళ్లను త్వరలోనే లబ్దిదారులకు అందించి, గృహ ప్రవేశాలు చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్యాంప్ కార్యాలయంలో పట్టణాభివృద్ధి శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 123 యూఎల్బీల్లో ప్రతీ ఇంటికి క్యూఆర్ కోడ్‌తో డిజిటల్ డోర్ నెంబర్లు త్వరితగతిన కేటాయించాలని సీఎం చెప్పారు. ఆస్తి పన్ను నుంచి మొదలుకుని అన్ని వివరాలు క్యూఆర్ కోడ్‌తో లింక్ చేయాలన్నారు.
భారత్ బిల్, మన మిత్రతో అనుసంధానం చేయాలని చెప్పారు చంద్రబాబు నాయుడు. అలాగే ఎక్కడా తాగునీరు కలుషితం కాకుండా వాటర్ క్వాలిటీ మోనిటరింగ్ ఎప్పటికప్పుడు జరగాలని, దీనికి స్మార్ట్ వాటర్ పైపులైన్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక వసతులు, ఇతర మరమ్మతులకు 100 రోజుల ప్రణాళిక అమలు చేయాలన్నారు. పండ్లు, పాలు, కూరగాయలు అమ్మేవాళ్ల వివరాలు రిజిస్టర్ చేయాలని సూచించారు. మరోవైపు పురమిత్ర యాప్‌ను రాష్ట్రంలో 17 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, దీని ద్వారా అన్ని మున్సిపల్ సేవలు పొందగలుగుతున్నారని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ యాప్ ద్వారా 92 వేల గ్రీవెన్స్‌లు రాగా, వాటిని పరిష్కరిస్తున్నామని తెలిపారు.
The post టిడ్కో ఇల్లు రాని వారికి దరఖాస్తు సొమ్ము తిరిగి చెల్లింపు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
