Heavy Rains | హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపరితల ఆవర్తన ద్రోణి, నైరుతిగాలుల ప్రభావంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని హెచ్చరించింది. అదే విధంగా కామారెడ్డి, సిద్దిపేట, జనగాం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గుతాయని పేర్కొంది.
రాష్ట్రంలో గురువారం వనపర్తి జిల్లాల్లో మిరప రైతు రాములు(27) పిడుగుపాటుకు మృతి చెందగా, వికారాబాద్ జిల్లాలో 300 మేకలు మృత్యువాత పడ్డాయి. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, తదితర ప్రాంతాల్లో మక్క పంట పూర్తిగా నేలకొరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈదురుగాలుల ధాటికి ఇండ్ల పైకప్పులు ఎగిరిపోవడమే కాకుండా, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
రాష్ట్రంలోని కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో శుక్రవారం అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఖమ్మం జిల్లా వైరాలో 2.51 సెం.మీ, జోగులాంబ -గద్వాల జిల్లా రాజోలిలో 2.39 సెం.మీ, అయిజాలో 1.34 సెం.మీ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌లో 1.57 సెం.మీ చొప్పున బుధవారం వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ తెలిపింది.
