Dhurandhar 2 | బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన దురంధర్-2: ది రివెంజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమా థియేటర్స్ లో ప్రదర్శితం అవుతున్నా కూడా చాలా మంది ధురంధర్ 2 సినిమాని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే మూవీ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు వెర్షన్ కోసం టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు హిందీ వెర్షన్ ప్రదర్శించడంతో థియేటర్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగినప్పటికీ, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినిమా విడుదల సమయంలో ఆన్లైన్‌లో తెలుగు వెర్షన్‌కు కూడా బుకింగ్స్ ఓపెన్ చేయడంతో చాలా మంది ప్రేక్షకులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే, ప్రదర్శన సమయానికి థియేటర్‌లో హిందీ వెర్షన్ ప్లే చేయడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.
హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ ప్రాంతంలోని పీవీఆర్ నెక్స్ట్ గలేరియా మాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. తెలుగు వెర్షన్ టికెట్లు తీసుకున్న ప్రేక్షకులు హిందీ సినిమా ప్రదర్శనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు చూపించాల్సిన భాషలో సినిమా ప్లే చేయకపోవడంతో థియేటర్ యాజమాన్యంపై ఆందోళనకు దిగారు.అనుకున్న సమయానికి తెలుగు వెర్షన్ ప్రారంభం కాకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు అక్కడికి చేరుకుని ప్రేక్షకులను శాంతింపజేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి, థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు.
తదుపరి చర్యలలో భాగంగా దాదాపు గంట ఆలస్యంగా తెలుగు వెర్షన్‌ను ప్రదర్శించడం ప్రారంభించడంతో ప్రేక్షకులు శాంతించారు. అయినప్పటికీ, ఈ ఘటనపై సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థలో ఇలాంటి లోపాలు పునరావృతం కాకుండా చూడాలని సినీ ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి, భారీ అంచనాల మధ్య విడుదలైన ‘దురంధర్-2’ సినిమాకు సంబంధించిన ఈ గందరగోళం థియేటర్ నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు.
