హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ పార్టీకి చెందిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొంత కాలంగా అంతర్గతంగా చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన ప్రత్యేకంగా సమయం చిక్కినప్పుడల్లా ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. పార్టీలో చర్చకు దారితీసేలా చేసింది. ఈటల ముందు నుంచి వామపక్ష భావజాలంతో ఉన్న వ్యక్తి. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో నెంబర్ 2 గా ఎదిగారు. అక్కడ కేసీఆర్ తో పడక బయటకు వచ్చారు. స్వంతంగా పార్టీ పెడతారని ఆశించారు. కానీ అనూహ్యంగా బీజేపీలో చేరారు. ప్రస్తుతం అదే పార్టీపై పోటీ చేసి ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందారు. కానీ ఇక్కడ కూడా ఆయనకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయి.
ఈ సందర్బంగా ఈటల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల సమక్షంలోనే పార్టీ నాయకత్వంపై మండిపడ్డారు. ఒక రకంగా నిలదీసినంత పని చేశారు. మేమేం పార్ట్ టైమ్ రాజకీయ నాయకులం కాదన్నారు ఈటల రాజేందర్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను రాష్ట్ర నాయకత్వం నిర్ణయించడం మానేయాలని అన్నారు. మా పార్లమెంట్ నియోజకవర్గ పరిధుల్లో అభ్యర్థులను మేమే బరిలోకి దించుతాం అని ప్రకటించారు. రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నేను ఇప్పటికే సర్వేలు చేశాం.. మా అభ్యర్థులను మేమే నిర్ణయిస్తాం అని స్పష్టం చేశారు.
The post తెలంగాణ బీజేపీ నాయకత్వంపై ఈటల గుస్సా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
