Sand Illegal Mining | నాగర్‌కర్నూల్, మార్చి 27 : నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ.. అదుపు లేకుండా పోతున్నది. దుందుభి నదిని తోడేస్తూ గర్భశోకం మిగిల్చుతున్నారు. అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పేరుతో యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. అధికారులు తనిఖీ చేసిన సమయంలో అనుమతుల పేపర్లు చూపిస్తూ ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్న చోటికి కాకుండా.. వ్యాపారులు మరో చోటికి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో తాడూరు మండలం ఏటిధర్‌పల్లి, గోవిందాయపల్లి గ్రామాల మధ్య ఇసుక వివాదం చోటుచేసుకున్నది.
రెండు గ్రామాల మధ్య పారుతున్న దుందుభి నది నుంచి ఇసుక తరలించే విషయంలో వాటాల వివాదం రేగుతోంది. తాడూరు మండలం ఎటిధర్‌పల్లి గ్రామ సమీపంలోని రీచ్ నుంచి ఇసుక తరలించవద్దంటూ ట్రాక్టర్లను రైతులు పలుమార్లు అడ్డుకున్నారు. ఈ విషయమై కలెక్టర్‌తోపాటు రెవెన్యూ, మైనింగ్, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ అధికారులు అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పోలీస్ బందోబస్తు మధ్య ఇసుక రవాణా చేశా రు. ఏటిధర్‌పల్లి సమీపంలోని ఇసుక రీచ్‌కు వెళ్లే రహదారి ఇటీవల కురిసిన వర్షానికి దెబ్బతిన్నది. దీంతో గోవిందాయపల్లి సమీపం నుం చి మరో మట్టి రోడ్డును రీచ్ వరకు వ్యాపారు లు ఏర్పాటు చేశారు. వారం రోజులుగా యథావిధిగా ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకున్న వారికి ఇసుక తరలింపు కొనసాగుతున్నది.
సర్పంచ్ భర్త దౌర్జన్యం
ఇసుకను తీసుకెళ్తున్న ట్రాక్టర్ యాజమాన్యంపై గోవిందాయపల్లి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ భర్త శేఖర్ దౌర్జనానికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గురువారం కొందరు ట్రాక్టర్ యజమానులు ఆన్‌లైన్ ద్వారా నాగర్‌కర్నూల్ ప్రాంతానికి ఇసుకను బుకింగ్ చేసుకొని తీసుకెళ్తుండగా.. సదరు వ్యక్తి అభివృద్ధి పనుల పేరు చెప్పి తమ గ్రామంలోనే డంప్ చేయాలంటూ దౌర్జన్యంగా ఇసుక ట్రాక్టర్‌ను అడ్డుకున్నాడు. ట్రాక్టర్ యజమానులు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీస్, రెవెన్యూ, ఆర్‌ఐ, జీపీవోలు అక్కడికి చేరుకున్నారు.
ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకున్న ఇసుక ఇదని.. ఎక్కడ పడితే అక్కడే డంపింగ్ చేయడానికి వీలు లేదని చెప్పారు. అయినా పట్టువీడని సర్పంచ్ భర్త తమ గ్రామం నుంచే ట్రాక్టర్లు వెళ్తున్నాయని చెప్పి నాగర్‌కర్నూల్ ప్రాంతానికి బుకింగ్ అయిన ఇసుకను గోవిందాయపల్లిలోనే డంపింగ్ చేయించుకున్నాడు. అక్కడికి వెళ్లిన అధికారులు గానీ.. పోలీసులు గానీ ఏమీ చేయలేకపోయారు. అక్కడ డంప్ చేసిన ఐదు ఇసుక ట్రాక్టర్లు మరోసారి రీచ్ వద్ద ఇసుకను నింపుకొని వస్తుండగా ఏటిధర్‌పల్లివాసులు అడ్డుకున్నారు. ఇదివరకు బుకింగ్ చేసుకున్న ఇసుకను గోవిందాయపల్లిలో డంపింగ్ చేసి, మళ్లీ బుకింగ్ లేకుండా ఎలా ఇసుకను తరలిస్తారంటూ ప్రశ్నించారు. ట్రాక్టర్ల యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. సదరు ట్రాక్టర్లను తాడూరు పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అనుమతుల పేరుతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏటిధర్‌పల్లి వాసులు కోరుతున్నారు.
