Flight Services | న్యూఢిల్లీ, మార్చి 27: భారతీయ విమానయాన రంగంపై పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో ఇప్పటికే గల్ఫ్ దేశాలకు దేశీయ విమానయాన సంస్థలు 72 శాతం సర్వీసులను తగ్గించేశాయి. దాదాపు నెల రోజుల క్రితం ఫిబ్రవరి 28న వార్ మొదలవగా.. అప్పట్నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు విమానాలు నడుపుతున్న భారతీయ సంస్థలు ప్రతి నాల్గింటిలో సుమారు మూడింటిని రద్దు చేశాయి. ఈ నేపథ్యంలో ఈసారి సమ్మర్ లోనూ విమానాల సంఖ్యను తగ్గించేయనున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం.. మార్చి 29 నుంచి అక్టోబర్ 24 వరకు దేశీయంగా వారానికి 23,049 విమానాలే నడువనున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో నడిచినవి 25,610గా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది 10 శాతం (2,561 విమానాలు) రద్దీ తగ్గనున్నది. ఈ మేరకు డీజీసీఏకు చెందిన ఓ సీనియర్ అధికారి స్పష్టం చేశారు.
ఎందుకీ పరిస్థితి?
ఈ ఏడాది మార్కెట్‌లో అనిశ్చిత పరిస్థితి అధికంగా ఉన్నదని విమానయాన సంస్థల వర్గాలు పీటీఐతో పేర్కొన్నాయి. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల నడుమ ఈసారి దుబాయ్ తదితర గల్ఫ్ ప్రాంతాలకు విమాన సర్వీసులు బాగా తగ్గిపోయాయి. అలాగే అమెరికా-ఇజ్రాయెల్ దేశాలకు మద్దతుగా ఉంటున్నాయని పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్నది. దీంతో అక్కడ ముడి చమురు ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఇది అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల్ని ఎగదోస్తుండగా.. విమానాల నిర్వహణ వ్యయం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఫలితంగా టిక్కెట్ రేట్లను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ కూడా చాలామంది సమ్మర్ టూర్లను ప్రభావితం చేస్తున్నాయని ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు చెప్తున్నారు. ఇందుకు తగ్గట్టే విమాన సర్వీసుల సంఖ్యనూ తగ్గించేందుకు విమానయాన కంపెనీలు నిర్ణయించాయి. వచ్చే నెల ఏప్రిల్ నుంచి రోజూ దాదాపు 2వేల విమానాలను నడుపాలని ఇండిగో భావించింది. అయితే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల దృష్ట్యా పునరాలోచనలో పడింది. పెరుగుతున్న ఇంధన ధరలు, పడిపోతున్న రూపాయి మారకం విలువ కూడా విమానయాన రంగంపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
ఎయిర్‌లైన్స్‌కు ట్రిపుల్ షాక్
పశ్చిమాసియా సంక్షోభంతో ఎయిర్‌లైన్స్‌కు మూడు రకాలుగా నష్టం వాటిల్లుతున్నది. ఒకటి పెరుగుతున్న ఇంధన ధరలైతే, మరొకటి యుద్ధం కారణంగా ఆయా దేశాలు తమ గగనతలాలను మూసివేయడం, ఇంకొకటి రూపాయి నష్టాలు. పెరిగిన ఇంధన ధరలతో ప్రయాణికులు చార్జీల భారం మోపాల్సి వస్తుండటంతో వ్యాపారం దెబ్బతింటున్నది. అలాగే వివిధ దేశాల్లో గగనతల ఆంక్షలతో ఆయా మార్గాల్లో గమ్యస్థానాలను చేరాలంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తున్నది. ఇక డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలకు పతనమవుతుండటం కూడా ఎయిర్‌లైన్స్‌కు మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతున్నది. ఎయిర్‌క్రాఫ్ట్ లీజులు, నిర్వహణ వ్యయం, విడిభాగాల కొనుగోలు, విదేశీ సిబ్బంది వేతనాల చెల్లింపులు వంటి డాలర్ ఆధారిత ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని ఎయిర్‌లైన్స్ లబోదిబోమంటున్నాయిప్పుడు.
ఏప్రిల్ 1 నుంచి మొదలు..
పెరుగుతున్న చమురు ధరల ప్రభావం.. ఏప్రిల్ 1 నుంచి విమానయాన ఇంధన (ఏటీఎఫ్) ధరల సవరణల్లో కనిపించవచ్చని భారత పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అంటున్నారు. ఆర్థికపరంగా ఈ సంక్షోభం పూర్తి ప్రభావం మున్ముందు ఉంటుందని ఉద్యోగులనుద్దేశిస్తూ ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ చేసిన వ్యాఖ్యలు.. కొలువుల్లో కోతల సందేహాలను రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి గల్ఫ్ యుద్ధం దెబ్బకు మరిన్ని విమానాలు రద్దయ్యే వీలు లేకపోలేదన్న అభిప్రాయాలే ఇండస్ట్రీ నుంచి వ్యక్తమవుతుండటం గమనార్హం.
గత నెల ఫిబ్రవరి 28 నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన ప్రతి నాలుగు విమానాల్లో మూడింటిని రద్దు చేసిన భారతీయ విమానయాన సంస్థలు.
ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్ కంపెనీలు దాదాపు 2,400 విమాన సర్వీసులను రద్దు చేసినట్టు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి.
నెల రోజుల్లో షెడ్యూల్ ప్రకారం భారత్ నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు 3,300 విమానాలు నడువాల్సి ఉన్నది. అంటే 72 శాతం క్యాన్సిల్ అయ్యాయన్నమాట.
భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికుల్లో దాదాపు సగం మంది గల్ఫ్ దేశాలకే. గత ఏడాది ఒక్క యూఏఈకే 1.21 కోట్ల మంది భారత్ నుంచి వెళ్లారు.
సౌదీ అరేబియాకు కూడా నిరుడు సుమారు 30 లక్షల మంది భారతీయులు వెళ్లారు. ఒమన్, కువైట్, బహ్రెయిన్, ఖతార్‌లకూ రద్దీ ఎక్కువే. దీంతో దేశీయ విమానయాన సంస్థల అదాయానికి ఈ యుద్ధం గండి కొట్టినట్టే అవుతున్నది.
దేశీయ విమానయాన రంగ దిగ్గజం ఇండిగో అంతర్జాతీయ ప్రయాణికుల వాటాలో 35-45 శాతం పశ్చిమాసియా దేశాలదే. ఎయిర్ ఇండియాలో ఇది 30-35 శాతంగా ఉన్నది.
మధ్య, చిన్నశ్రేణి విమానయాన సంస్థల విషయానికొస్తే.. స్పైస్‌జెట్ ఆదాయంలో దాదాపు 40 శాతం, ఆకాశ ఎయిర్‌కు సుమారు 80 శాతం విదేశీ ఆదాయం గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నది.
ఈ సమ్మర్ షెడ్యూల్‌లో విమానాలు నడుపుతున్న సంస్థలివే
ఎయిర్ ఇండియా
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్
ఇండిగో
ఆకాశ ఎయిర్
స్పైస్‌జెట్
అలయెన్స్ ఎయిర్
ఫ్లై91 l స్టార్ ఎయిర్
ఇండియావన్ ఎయిర్
