Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన సంస్కృతి పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. జపాన్‌కు చెందిన గీక్ పిక్చర్స్ సీఈఓ టొమాట్సు కోసానోకు సీతారామ కళ్యాణం చిత్రపటాన్ని బహూకరించడం విశేషంగా నిలిచింది. శ్రీరామనవమి సందర్భంగా ఈ కానుకను అందించడం ద్వారా భారతీయ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉద్దేశాన్ని అల్లు అర్జున్ వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మన దేశ సంస్కృతి, ఇతిహాసాలు, శ్రీరాముడి కథ ప్రాముఖ్యత గురించి టొమాట్సు కోసానోకు వివరించినట్లు సమాచారం.
సీతారాముల కల్యాణం చిత్రపటం భారతీయ సంస్కృతికి ప్రతీకగా భావించబడుతుంది. అలాంటి పవిత్రమైన చిత్రాన్ని విదేశీ అతిథికి బహూకరించడం ద్వారా అల్లు అర్జున్ తనలోని ఆధ్యాత్మికతను, భారతీయ వారసత్వంపై ఉన్న గౌరవాన్ని మరొసారి చాటిచెప్పారు. దీనిపై అభిమానులు, సినీ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇటీవల భారతీయ సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న గుర్తింపు నేపథ్యంలో, ఇలాంటి సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు ఈ విధంగా భారతీయ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడం విశేషంగా మారింది.
ఇక సినిమాల విషయానికి వస్తే, అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె కథానాయికగా నటిస్తుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రేక్షకులను అలరించనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.పుష్ప2 చిత్రం తర్వాత బన్నీ క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు అట్లీ సినిమాతో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.
