Kiara Advani | కియారా అద్వానీ ప్రస్తుతం మదర్ హుడ్ను ఆస్వాదిస్తూ జీవితంలో కొత్త దశను ఎంజాయ్ చేస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్న ఆమె ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తల్లి అయిన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కియారా మాట్లాడుతూ… తల్లి అయిన తర్వాత తాను మునుపటి కంటే మరింత బలంగా మారానని తెలిపారు. ఇప్పుడు నేను నన్ను ‘టైగ్రెస్’లా భావిస్తున్నాను. జీవితాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోయింది. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనిపిస్తే… మరికొన్ని చిన్న విషయాలు కూడా చాలా ముఖ్యంగా అనిపిస్తున్నాయి” అని పేర్కొన్నారు.
అయితే పెళ్లికి ముందు ఉన్న తన వ్యక్తిగత జీవితం, సంబంధాల్లో పెద్దగా మార్పులేదని చెప్పారు. ముఖ్యంగా భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో ఉన్న బంధం ఇప్పటికీ అలాగే కొనసాగుతోందని తెలిపారు. మేము కలిసి బయటికి వెళ్లడం, సినిమాలు చూడడం, మాట్లాడుకోవడం వంటి విషయాల్లో ఎలాంటి మార్పు లేదు అని వెల్లడించారు. ఇక సినిమాల విషయానికి వస్తే, కియారా త్వరలోనే టాక్సిక్ సినిమాతో వెండితెరపై రీ-ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో ‘నాడియా’ పాత్రలో కనిపించనున్న ఆమెతో పాటు నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మొదట మార్చిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం, ప్రస్తుతం జూన్ 4న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మదర్ హుడ్ తర్వాత కియారా అద్వానీ తిరిగి తెరపై ఎలా మెప్పిస్తారో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. కాగా, మహేష్ బాబు ‘భరత్ అనే నేను’, రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ & ‘గేమ్ ఛేంజర్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులని కూడా పలకరించింది బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ. ఈ అమ్మడు పెళ్లైన తర్వాత కూడా సోషల్ మీడియాలో తన అందచందాలతో అదరగొడుతుంది.
