Vijay | తమిళ సినీ నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. మార్చి 30, సోమవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.404.58 కోట్లుగా ప్రకటించారు.అఫిడవిట్ ప్రకారం, విజయ్‌కు చెందిన మొత్తం ఆస్తులు రూ.4,04,58,57,196గా ఉన్నాయి. ఇందులో బ్యాంక్ డిపాజిట్లు, పెట్టుబడులు, స్థిరాస్తులు, వాహనాలు తదితర అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన వద్ద ఉన్న లగ్జరీ కార్లు కూడా ఆకర్షణీయంగా నిలిచాయి. BMW 530, BMW i7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్ఫైర్ వంటి ఖరీదైన కార్లు, అలాగే ఇతర వాహనాలు, బైక్‌లు కూడా ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
అఫిడవిట్లో గత ఐదు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆదాయ వివరాలను కూడా విజయ్ వెల్లడించారు.
2024–25లో రూ.184.53 కోట్లు
2023–24లో రూ.105.69 కోట్లు
2022–23లో రూ.198.71 కోట్లు
2021–22లో రూ.237.46 కోట్లు
2020–21లో రూ.8.04 కోట్లు ఆదాయం పొందినట్లు తెలిపారు
ఇక ఆయన భార్య 2020–21 ఆర్థిక సంవత్సరానికి రూ.6,13,520 ఆదాయం పొందినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. తమిళగ వెత్రి కళగం (TVK) పార్టీని స్థాపించిన విజయ్, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు. చెన్నైలోని పెరంబూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అలాగే మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నట్లు సమాచారం. నామినేషన్ అనంతరం ఓపెన్ టాప్ వాహనంలో ప్రచారం నిర్వహించిన విజయ్, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీ గుర్తు ‘విజిల్’కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కళగం (DMK)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. డీఎంకేను “దుష్ట శక్తి”గా అభివర్ణించారు.
తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు రాజకీయంగా హీట్ పెంచుతున్నాయి. ముఖ్యంగా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ పోటీ చేయడం ఎన్నికలపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయన ప్రకటించిన భారీ ఆస్తులు, ఆదాయ వివరాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
