తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 01వ తారీఖున ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతా రాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు అందించేందుకు 85 వేల తిరుమల శ్రీవారి లడ్డూలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 1లో శ్రీవారి సేవకుల సహకారంతో లడ్డూల ప్యాకింగ్‌న టీటీడీ ఒక బృహత్కార్యక్రమంగా నిర్వహించింది. ఈ లడ్డూల ప్యాకింగ్ కార్యక్రమంలో సుమారు 300 మంది శ్రీవారి సేవకులు అపార భక్తి, శ్రద్ధలతో పాల్గొన్నారని టీటీడీ స్పష్టం చేసింది.
తిరుమల ఎస్టేట్స్ అధికారి, డిప్యూటీ ఈవో (పరకామణి ఇన్‌ఛార్జ్) శ్రీ వెంకటేశ్వరులు ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట వరకు నిరంతరాయంగా సాగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశాల మేరకు సుమారు 200 మంది మహిళా సేవకులు, 100 మంది పురుష సేవకులు కలిసి ఐదు గంటలపాటు అంకిత భావంతో సేవలందించారని తెలిపారు.
లడ్డూల ప్యాకింగ్, లోడింగ్, రవాణా వంటి అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీవారి సేవా సదన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఒంటిమిట్ట వేదికగా జరిగే శ్రీ కోదండ రాములోరి కళ్యాణోత్సవానికి విశిష్ట అతిథిగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ సందర్బంగా పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరపున సమర్పించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
The post శ్రీ సీతా రాముల కల్యాణానికి శ్రీవారి లడ్డూలు సిద్ధం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
