అమరావతి : రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని చెప్పారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి కలిగించేలా ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, మరో పరిశ్రమ అభివృద్ధికి పాలసీలు తీసుకొస్తోందన్నారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ కూడు, గూడు, గుడ్డ నినాదంతో చేనేత రంగానికి అండగా నిలిచారని అన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు చేనేత రంగ అభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు రూపొందిస్తూ వస్తున్నారని తెలిపారు. నూతన టెక్స్ టైల్స్ పాలసీలు అమలు చేయడం, మెగా క్లస్టర్లు, టెక్స్ టైల్స్ పార్కులు ఏర్పాటు చేయడంతో పాటు నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి కలిగేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు మంత్రి ఎస్. సవిత.
దీనిలో భాగంగానే బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షా నాలుగు వేల చేనేతల కుటుంబాలకు మేలు కలిగే ఉచిత విద్యుత్ పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ పథకం ద్వారా ఏటా రూ.150 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుందని, అయినా నేతన్నల కోసం భరించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. జగన్ ప్రభుత్వ తీరుతో పూర్తిగా నిర్వీర్యమై పోయిన చేనేత రంగానికి 2024లో సీఎం చంద్రబాబు ఏర్పాటుతో మహర్దశ ప్రారంభమైందన్నారు సవిత. నేతన్నలకు ఏడాది పాటు ఉపాధి కల్పనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు అమలు చేస్తున్నారని వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 92,724 మంది నేతన్నలకు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెన్షన్ మొత్తం పెంచారని తెలిపారు. చేనేతలకు త్రిఫ్ట్ కింద ప్రభుత్వ వాటాను 8 నుంచి 16 శాతానికి పెంచడం జరిగిందన్నారు ఎస్. సవిత.
The post నేతన్నల కుటుంబాల్లో నేటి నుంచి వెలుగులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
