అమరావతి : సూక్ష్మ సేద్యం పథకం ( మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్) అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించి, రికార్డు స్థాయిలో 1,26,057 హెక్టార్లను సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకువచ్చిన అధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఏపీ తర్వాత 1.05 లక్షల హెక్టార్ల మైక్రో ఇరిగేషన్ సాగుతో గుజరాత్ రెండో స్థానంలో ఉందన్నారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి, ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు చేసిన కృషిని కొనియాడారు. ఈ పథకాన్ని వినియోగించు కుంటున్న 1,08,143 మంది రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆధునిక సాగు పద్ధతుల ద్వారా వారికి నాణ్యమైన దిగుబడి, అధిక లాభాలు రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ముఖ్యంగా డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులను అవలంభిస్తున్న రైతులకు నీటి పొదుపుతో పాటు సాగు ఖర్చు తగ్గి, ఆర్థికంగా నిలదొక్కు కుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. టమాటా, ఆయిల్ పామ్, మిర్చి వంటి పంటల నుంచి పప్పు ధాన్యాల వరకు వైవిధ్యమైన పంటలు సాగు చేస్తున్న రైతాంగానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రాజెక్టు అమలులో భాగంగా రూ. 1030 కోట్ల మేర సబ్సిడీని రైతులకు అందించామన్నారు. మైక్రో ఇరిగేషన్‌ను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ.. అర్హులైన ప్రతి రైతుకూ సకాలంలో సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని వేల హెక్టార్లను సాగులోకి తెచ్చి, ఏపీని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
The post సూక్ష్మ సేద్యంలో ఏపీ అగ్రస్థానం సీఎం సంతోషం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
