హైదరాబాద్ : పశ్చిమాసియా యుద్ధాన్ని(US-Iran war) ముగించేందుకు చేపట్టిన చర్యలు విఫలమైనట్లుగా కనిపిస్తున్నది. ప్రపంచ ఇంధన మార్కెట్లను స్తంభింపచేసి వాణిజ్యానికి అంతరాయం కలిగించిన ప్రతిష్టంభన తొలగించి శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం శనివారం ఇస్లామాబాద్‌లో ఇరాన్ ప్రతినిధులతో చారిత్రాత్మక ముఖాముఖీ చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు విఫలమయ్యాయని జేడీ వాన్స్ తెలుపడంతో ఆందోళన కలిగిస్తున్నది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా నిబంధనలు అంగీకరించేందకు ఇరాన్ ఏమాత్రం సిద్ధంగా లేదని జేడీ వాన్స్ అసహనం వ్యక్తం చేశారు.
ఆ దేశం నుంచి సానుకూలమైన వాతావరణం కనిపించడం లేదని ఆరోపించారు. ఇరాన్ ప్రతినిధులతో 21 గంటలు చర్చలు జరిపాం. ఇది చాలా చేదు వార్త అని..చర్చల్లో ఎలాంటి ఒప్పందం లేకుండానే అర్ధాంతరంగా వెనుదిరిగి వెళ్లడం బాధగా ఉందన్నారు. ఈ విషయంలో అమెరికాకంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టం అన్నారు. కాగా, చర్చల ద్వారా కీలక పురోగతి సాధిస్తారనే అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ప్రకటన తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందని పలవురు రాజకీయ విశ్లేషకులు అన్నారు. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు.
