అమరావతి : ఏపీలో వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలో ఎండ, వడగాలులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈనెల 22న బుధవారం 76 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 134 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎండీ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎల్లుండి 51తీవ్ర, 94 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా శ్రీకాకుళం 19, విజయనగరం 21, మన్యం 3, అల్లూరి 4, పోలవరం 5, విశాఖ1, అనకాపల్లి 15, కాకినాడ 6, తూర్పుగోదావరి 2 మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెంలో 44.4°C, ప్రకాశం జిల్లా లోని కొప్పెరపాడులో 44.1°C, నెల్లూరు(జి) కొమ్మిపాడు, కాకినాడ(జి) కరపలో 43.6°C, కడపలో 43.5°C,అనంతపురం(జి) తెరన్నపల్లిలో 43.4°C, మార్కాపురం(జి) నందన మారెళ్లలో 43.3°C, శ్రీసత్యసాయి(జి) తలుపుల, నంద్యాల(జి) సంజామలలో 43.2°C, పల్నాడు(జి) గురజాలలో 42.9°C, కర్నూలు(జి) తోవి, అన్నమయ్య(జి) నూలివీడులో 42.5°C, చిత్తూరు(జి) తవణంపల్లెలో 42.3 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. 288 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు వెల్లడించారు.
ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. మరోవైపు రేపు మన్యం, అల్లూరి, పోలవరం కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.
The post ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
