అమరావతి : రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. ఇవాళ కొలుసు మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో ఎంతో గౌరవం, పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రతిష్ఠను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధః పాతాళానికి తొక్కేసిందని విమర్శించారు. అధికారం, ఆస్తి కోసం వైసీపీ నేతలు ఎంతటి నీచానికైనా దిగజారుతారని ఆయన మండిపడ్డారు. వైసీపీ మనుగడ మొత్తం విద్వంసం, భయాందోళనలు, హత్యలు అనే మూడు రెక్కల మీద సాగుతోందని ధ్వజమెత్తారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య నుంచి నేటి దస్తగిరి హత్య వరకు ఆ పార్టీ అనుసరిస్తున్న పనితీరు ఒకేలా ఉందని ఆయన ఆరోపించారు.
అప్పట్లో వివేకానంద రెడ్డి గుండెపోటుతో చని పోయారని నమ్మించే ప్రయత్నం చేసి, ఆపై సానుభూతి కోసం నాటకాలు ఆడారన్నారు. దస్తగిరి మరణాన్ని కూడా గంజాయి బ్యాచ్ గొడవగా చిత్రీకరించి పక్కదారి పట్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు కొలుసు పార్థసారథి.. హంతకులే బాధితుల వద్దకు వెళ్లి మొసలి కన్నీరు కార్చడం అత్యంత హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. 2019 నుండి 2024 వరకు అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు దస్తగిరి వంటి వారిని వాడుకుని వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారని మంత్రి పేర్కొన్నారు. దస్తగిరి నివాసంలో పోలీసుల సోదాల్లో ప్రాథమికంగా 150 కోట్ల విలువైన పత్రాలు దొరికినట్లు తెలిసినా, లోతుగా పరిశీలిస్తే అవి 500 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని ప్రజలు చర్చించు కుంటున్నారని ఆయన వెల్లడించారు.
The post ఏపీకి శాపంగా మారిన వైఎస్సార్సీపీ : కొలుసు పార్థసారథి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
