Suicide | వాషింగ్టన్ : ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన ఆ యువకుడి కలలు కల్లలయ్యాయి. ఉద్యోగం దొరకక, అప్పుల బాధ తాళలేక చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లాకు చెందిన ఇరగనబోయిన చందు(26) అనే యువకుడు అమెరికాలో ఇటీవల ఆత్మహత్య చేసుకొన్నాడు. షికాగోలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి కొన్ని వారాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోవడం, తన చదువు కోసం చేసిన అప్పును తీర్చలేకపోవడం వల్ల మానసికంగా కుంగిపోయిన అతడు ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడినట్టు భావిస్తున్నారు.
మృతుడి తండ్రి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. అతడి మరణ వార్త తెలిసిన వెంటనే అమెరికాలోని భారతీయులు అతడి మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు ఆన్లైన్ ద్వారా విరాళాలు సేకరించారు.
చందు మృతదేహాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విరాళాల ద్వారా ఇప్పటికే రూ.72.56 లక్షలు వచ్చింది. ఇందులో చందు మృతదేహానికి తరలింపునకు అయ్యే ఖర్చు, అంత్యక్రియల ఖర్చు పోగా మిగిలిన మొత్తాన్ని అతడి విద్యా రుణాన్ని తీర్చడానికి అతడి కుటుంబానికి అందిస్తామని విరాళాలు సేకరించేవారు తెలిపారు. చందు ఆత్మహత్య అమెరికాలో భారత నిరుద్యోగ యువత పరిస్థితికి దర్పణం పట్టింది. పలువురు ఉన్నత చదువులు చదివినా కొలువులు దక్కకపోవడంతో కుంగిపోతున్న విషయం వెలుగులోకి వచ్చింది.
