Ravi Babu | టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పెద్ది సినిమా విడుదల వాయిదా పడటం ఇండస్ట్రీపై ప్రభావం చూపుతోంది. మొదట ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం అనేక మార్లు తేదీలు మారుతూ చివరకు జూన్ 4కు ఖరారైంది. ఈ మార్పుల కారణంగా చిన్న సినిమాల విడుదల గందరగోళానికి గురయ్యాయి. పెద్ది సినిమాకి ఇప్పటికే పలు డేట్స్ చెప్పారు. అయితే చెప్పిన తేదీన వస్తుందని భావించి, చాలా చిన్న సినిమాలు తమ విడుదలలను వాయిదా వేసుకున్నాయి. అయితే చివరి నిమిషంలో పెద్ది రాకపోవడంతో కొందరు నిర్మాతలు అయోమయంలో పడ్డారు. ఈ ప్రభావం దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన ‘రేజర్’ సినిమాపై కూడా పడింది. ఈ చిత్రం మే 8న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిబాబు విడుదల తేదీల గందరగోళంపై స్పందించారు.
మొదట మా సినిమాను మే 1న విడుదల చేయాలని అనుకున్నాం. కానీ ఒక పెద్ద సినిమా వస్తుందని ప్రచారం జరిగింది. ఆ భయంతో మార్కెట్ మొత్తం హడావుడిగా మారింది. పెద్ద సినిమాలు ఒక తేదీ ప్రకటిస్తాయి కానీ ఆ రోజున రావు. వాటి వల్ల చిన్న సినిమాలు ఇబ్బందులు పడుతున్నాయి” అని ఆయన అన్నారు. ఆ సినిమా వస్తుందని భావించి మేము వాయిదా వేసుకున్నాం. మళ్లీ వస్తుందని, మళ్లీ రాదని ఇలా కొన్ని రోజుల పాటు గందరగోళం కొనసాగింది. చివరకు ఈ పరిస్థితి సరిగ్గా లేదని భావించి మాకు మే 8 తేదీని ఖరారు చేసుకున్నాం. ఆ రోజు నా తండ్రి పుట్టినరోజు కావడం కూడా ప్రత్యేకం అని రవిబాబు తెలిపారు.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. పెద్ద సినిమాల విడుదల తేదీల మార్పులు చిన్న చిత్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయనే అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. నిర్మాతలు, దర్శకులు ఈ సమస్యకు పరిష్కారం కావాలని కోరుతున్నారు.దీనిపై పెద్ద నిర్మాతలు ఎవరైన స్పందిస్తారా అనేది చూడాలి.
