పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : రాష్ట్రంలో ఉన్న సంచార జాతులు గౌరవ ప్రదమైన జీవనం సాగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. సంచార జాతులకు గుర్తింపు కార్డులతో పాటు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను పలువురు సంచార జాతులకు చెందిన ప్రతినిధులు కలిశారు. తమ జాతులకు కుల ధ్రువీకరణ జారీ సమయంలో డీఎన్టీ అని పేర్కొంటూ నిర్ణయం తీసుకోవడంపై వారు ఆనందం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు. బీసీల్లో అన్ని సామాజిక వర్గాల వారికి ఆర్థిక, రాజకీయ, సామాజిక గుర్తింపు తీసుకు రావడమే సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
ముఖ్యంగా సంచార జాతుల వారిని అన్ని విధాలా భరోసానిస్తోందన్నారు ఎస్.సవిత. సంచార జాతుల వారికి గుర్తింపు ప్రధాన సమస్యగా మారిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే గుర్తింపు కార్డుల జారీపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీపైనా చర్యలు తీసుకుంటామన్నారు. సంచార జాతుల అభివృద్ధి విద్యతోనే ముడిపడి ఉందన్నారు. సంచార జాతుల వారికి ఇళ్లు సహా పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తమ బిడ్డలను పాఠశాలలకు పంపించాలని సూచించారు. అంతకు ముందు మంత్రి సవితను సంచార జాతుల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. మంత్రి సవిత ను కలిసిన వారిలో పూసల రవి, సి ఈశ్వర్ తేవర్, ముత్తు రామన్, మనీ కుమార్ తేవర్, పాండు దేవర్. పాండి తేవర్, శేఖర్ దేవ తదితరులు పాల్గొన్నారు.
The post సంచార జాతుల గౌరవప్రద జీవనమే లక్ష్యం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
